Vladmir Putin:'భారతీయ చిత్రాలకు అత్యంత ప్రజాదరణ...': బాలీవుడ్‌పై వ్లాద్మీర్ పుతిన్ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు. దీంతో మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియాతో మాట్లాడుతూ, ఇండియన్ సినిమాలు, బాలీవుడ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని వెల్లడించారు.
రష్యాలో భారతీయ చలన చిత్రాలకు ఎక్కువ ప్రజాదరణ
బ్రిక్స్ సభ్య దేశాల్లో సినిమా షూటింగ్‌లకు రష్యా ప్రోత్సాహకాలు అందిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు, పుతిన్ స్పందిస్తూ, "బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే, రష్యాలో భారతీయ చలన చిత్రాలకు ఎక్కువ ప్రజాదరణ ఉందని అనుకుంటున్నాను. మాకు ప్రత్యేకంగా టీవీ ఛానెల్ ఉంది. భారతీయ చలన చిత్రాలపై చాలా ఆసక్తి ఉంది. ఈ ఏడాది మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా బ్రిక్స్ దేశాల్లోని సినిమాలను పరిచయం చేస్తామని" వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.
బ్రిక్స్ గ్రూపులో 10 దేశాలు సభ్యత్వం
గడిచిన 4 నెలల్లో ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండో సారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్నప్పుడు, ఈ ఏడాది జులైలో మాస్కోకు మోడీ వెళ్లారు. ఆ సమయంలో 22వ భారత్-రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్‌ను స్థాపించగా, 2010లో సౌతాఫ్రికా చేరడంతో అది బ్రిక్స్‌గా మారింది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఈ బ్రిక్స్‌లో చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో 10 దేశాలు సభ్యత్వం పొందాయి.