Indonesia: బంగ్లాదేశ్‌కు వెళ్తున్న రహస్య నౌక సీజ్.. 405 టన్నుల రాకెట్ రసాయనం పట్టివేత!
ఈ వార్తాకథనం ఏంటి
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా రాజకీయ, సామాజిక వాతావరణం పెరిగింది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్‌ను తనకు దగ్గర చేసుకోవడం ద్వారా దక్షిణాసియాలో భారత్ ప్రభావాన్ని తగ్గించడంతోపాటు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవచ్చని డ్రాగన్ భావిస్తోంది. ఇందులో భాగంగానే మోంగ్లా పోర్టు ఆధునికీకరణకు పెట్టుబడులు పెట్టడంతోపాటు, తీస్తా నది ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న చైనా.. వాణిజ్యపరమైన రాయితీలు కూడా ప్రకటిస్తూ ఢాకాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది.
వివరాలు
నౌకలో ఏకంగా 405 టన్నుల సోడియం పెర్‌క్లోరేట్
ఈ నేపథ్యంలో చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న ఓ భారీ కార్గో నౌకను ఇండోనేషియా నేవీ అధికారులు స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.
ఆ నౌకలో ఏకంగా 405 టన్నుల సోడియం పెర్‌క్లోరేట్‌ను గుర్తించారు. ఇది శక్తివంతమైన ఆక్సిడైజింగ్ రసాయనం.
రాకెట్లు, క్షిపణుల తయారీలో ఉపయోగించే ప్రొపెల్లెంట్ల తయారీకి దీన్ని వినియోగిస్తారు.
దీంతోపాటు లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయని ఖాళీ సిమ్ కార్డులు కూడా నౌకలో బయటపడటం అనుమానాలకు తావిస్తోంది.
వివరాలు
100 క్షిపణులు తయారు చేయొచ్చట!
స్వాధీనం చేసుకున్న సోడియం పెర్‌క్లోరేట్‌తో సుమారు 100 క్షిపణులను తయారు చేయవచ్చని ఇండోనేసియా నేవీ కమాండర్ ఒకరు వెల్లడించారు.
అంత భారీ మొత్తంలో ఈ రసాయనాన్ని బంగ్లాదేశ్‌కు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అక్కడ ఈ సరకు ఎవరికి చేరాల్సి ఉంది? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఢాకా కేంద్రంగా ప్రచురితమయ్యే 'ది బిజినెస్ స్టాండర్డ్' కథనం ప్రకారం.. కొమొరోస్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ స్టార్ లైన్స్ అనే కార్గో నౌక చైనాలోని లియాన్యుంగాంగ్ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టుకు బయలుదేరింది.
నవంబర్ 7న ఇండోనేసియా జలాల్లోకి ప్రవేశించిన ఈ నౌకను సుమిత్రా ప్రాంతంలోని బెలవాన్ తీరానికి సమీపంలో అధికారులు అడ్డుకున్నారు.
వివరాలు
అనుమానాస్పద కదలికలతో బయటపడిన వ్యవహారం
నవంబర్ 20న బెలవాన్‌లోని నేవీ రీజినల్ కమాండ్-1లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండోనేసియా నేవీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
షెడ్యూల్ ప్రకారం ఈ నౌక నవంబర్ 8న మోంగ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది.
అయితే ప్రయాణ సమయంలో ఇంధనం నింపుకోవడానికి ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే బెలవాన్ జలాల్లో ఆగింది.
నౌక కదలికలు సాధారణంగా లేవని ఇండోనేసియా నేవీకి చెందిన గస్తీ నౌక కేఆర్ఐ సిగలు-857 రాడార్ గుర్తించింది.
అంతేకాకుండా, రేడియో ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా నౌక నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో అప్రమత్తమైన నేవీ సిబ్బంది ఆ నౌకను అడ్డగించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నౌకలో మొత్తం 36 కంటెయినర్లు ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
అనుమానాస్పద కదలికలతో బయటపడిన వ్యవహారం
వాటిలో 15 కంటెయినర్లలో 405 టన్నుల సోడియం పెర్‌క్లోరేట్‌ను తరలిస్తున్నట్లు బయటపడింది.
మరో 54 ప్యాలెట్లలో లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయని ఖాళీ 4జీ ఎల్‌టీఈ సిమ్ కార్డులు ఉన్నట్లు 'ది బిజినెస్ స్టాండర్డ్' వెల్లడించింది.
ప్రయాణ సమయంలో నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్)ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి ఉండొచ్చని ఇండోనేసియా నేవీ అనుమానిస్తోంది.
వివరాలు
రాకెట్లు, మిస్సైళ్ల తయారీలో ఉపయోగించే రసాయనం
సోడియం పెర్‌క్లోరేట్ అనేది అత్యంత శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్.
పారిశ్రామిక అవసరాలతోపాటు రాకెట్లు,క్షిపణుల ప్రొపెల్లెంట్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
అయితే ఈ రసాయనం తనంతట తానుగా పేలిపోయే స్వభావం కలిగి ఉండదు.
ఇతర పదార్థాల దహన ప్రక్రియకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించి,మంట వేగంగా వ్యాపించేందుకు సహాయపడుతుంది.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే స్థాయిలోనే సైనిక పరిశ్రమ ఉంది.
రాకెట్లు, క్షిపణులను తయారు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ లేవు.
ముఖ్యంగా సోడియం పెర్‌క్లోరేట్‌ను పెద్ద మొత్తంలో వినియోగించే ఆయుధ తయారీ వ్యవస్థ అందుబాటులో లేదు.
అలాంటప్పుడు 405 టన్నుల రసాయనాన్ని అక్కడికి ఎందుకు తరలిస్తున్నారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
వివరాలు
మోంగ్లా పోర్టుపై భారత్, చైనా దృష్టి
దీనికి తోడు ఎంవీ స్టార్ లైన్స్ నౌక రిజిస్ట్రేషన్ వివరాలు, షిప్పింగ్ పత్రాల్లోనూ కొన్ని వ్యత్యాసాలను ఇండోనేసియా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ నౌక చేరాల్సిన మోంగ్లా పోర్టుకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది.
బంగ్లాదేశ్‌లో ఛత్తోగ్రామ్ తర్వాత ఇది రెండో అతిపెద్ద నౌకాశ్రయం.
ఈశాన్య భారత రాష్ట్రాలకు సరకు రవాణా సులభతరం చేసేందుకు మోంగ్లా, ఛత్తోగ్రామ్ పోర్టులను ఉపయోగించుకునేలా భారత్ కొన్నేళ్ల క్రితం బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకుంది.
ఈ పోర్టుతో అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ఖుల్నా-మోంగ్లా రైల్వే లైన్ నిర్మాణానికి కూడా భారత్ ఆర్థిక సహాయం అందించింది.
అయితే ఇప్పుడు చైనా కూడా మోంగ్లా పోర్టు పరిసర ప్రాంతాల్లో తన ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తోంది.
వివరాలు
మోంగ్లా పోర్టుపై భారత్, చైనా దృష్టి
పోర్టుకు సమీపంలోని 110 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది జూన్‌లో చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ చైనా సివిల్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
వాస్తవానికి 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ స్థలాన్ని భారత్ సహకారంతో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసేందుకు కేటాయించారు.
అయితే గత ఏడాది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. ఆ తర్వాత అదే ప్రాంతంలో సెజ్ అభివృద్ధి చేసేందుకు చైనా ముందుకు రావడం గమనార్హం.
వివరాలు
మోంగ్లా పోర్టుపై భారత్, చైనా దృష్టి
మొత్తంగా మోంగ్లా పోర్టు చుట్టూ భారత్, చైనా తమ వ్యూహాత్మక ప్రయోజనాలను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. క్షిపణుల తయారీలో ఉపయోగించే 405 టన్నుల రసాయనంతో వెళ్తున్న నౌకను ఇండోనేసియా అడ్డుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ రసాయనం తరలింపు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? బంగ్లాదేశ్‌లో దీన్ని స్వీకరించాల్సిన సంస్థ ఏది? అనే ప్రశ్నలకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.