India-China: నాగరికతలపై వివాదం.. ట్రంప్‌కు ఇరాన్ ధీటైన సమాధానం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనా వంటి దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో నిర్వాహకుడు మైఖేల్ సావేజ్ పంచుకున్న లేఖను ట్రంప్ మళ్లీ పంచుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. భారత్ నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ స్పందించింది. ఆ లేఖలో ఆసియా దేశాల మహిళలు గర్భధారణ చివరి దశలో అమెరికాకు వెళ్లి పిల్లలకు జన్మనిస్తారని, అక్కడి చట్టాల ప్రకారం ఆ శిశువులకు వెంటనే అమెరికా పౌరసత్వం లభిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత వారు తమ కుటుంబ సభ్యులను భారత్, చైనా లేదా ఇతర దేశాల నుంచి అమెరికాకు తీసుకువస్తారని వ్యాఖ్యానించారు.
వివరాలు
భారత్, చైనా దేశాలు గొప్ప నాగరికతలకు పుట్టినిల్లు
జన్మ ఆధారిత పౌరసత్వంపై వచ్చిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ పంచుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. భారత్, చైనా దేశాలు గొప్ప నాగరికతలకు పుట్టినిల్లు అని స్పష్టం చేసింది. ఒక యుద్ధ నేరాలకు పాల్పడిన అధ్యక్షుడు ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని హెచ్చరించడం అసలైన నరకమని విమర్శించింది. గతంలో ట్రంప్ చేసిన హెచ్చరికలను ఉద్దేశిస్తూ ఈ ప్రకటన వెలువడింది.
వివరాలు
శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఈ రెండు దేశాలు
భారత్,చైనా నాగరికతలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన,ఇప్పటికీ కొనసాగుతున్న నాగరికతలుగా గుర్తింపు పొందాయి. నాలుగు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర,సంప్రదాయాలు ఈ దేశాల ప్రత్యేకత. ఈజిప్టు,మెసొపొటేమియా వంటి నాగరికతలు అంతరించిపోయినా,భారత్‌లో సింధు నది పరివాహక ప్రాంతంలో,చైనాలో హువాంగ్ హో నది తీర ప్రాంతాల్లో ఈ నాగరికతలు అభివృద్ధి చెందాయి. వేర్వేరు భౌగోళిక పరిస్థితుల్లో ఎదిగినా, ఆసియా చరిత్రపై ఇవి గణనీయమైన ప్రభావం చూపించాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయి. ఇక ఇరాన్‌కు చెందిన పర్షియా నాగరికత కూడా అత్యంత ప్రాచీనమైనదిగా గుర్తింపు పొందింది. అయితే అమెరికా దేశ చరిత్రను పరిశీలిస్తే, అది 1776లో స్థాపించబడింది. అంటే దాని చరిత్ర సుమారు రెండు వందల యాభై సంవత్సరాలపాటు మాత్రమే ఉంది.