LOADING...
Iran: 30 రోజుల్లో యుద్ధం ముగింపుకు ఇరాన్‌ 14 అంశాల ప్రణాళిక
30 రోజుల్లో యుద్ధం ముగింపుకు ఇరాన్‌ 14 అంశాల ప్రణాళిక

Iran: 30 రోజుల్లో యుద్ధం ముగింపుకు ఇరాన్‌ 14 అంశాల ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకాలని దౌత్య ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మార్గంగా అమెరికాకు ఇరాన్‌ కొత్త ప్రణాళికను సమర్పించింది. ఈ ప్రణాళిక అమలైతే 30 రోజుల్లో యుద్ధానికి ముగింపు పలకవచ్చని భావిస్తున్నారు. మొత్తం 14 అంశాలతో రూపొందిన ఈ ప్రణాళిక మూడు దశలుగా విభజించబడింది. మొదటి దశలో హర్మూజ్‌ జలసంధిని దశలవారీగా తెరవాలని ప్రతిపాదించారు. ఇరాన్‌ నౌకాశ్రయాలపై ఉన్న దిగ్బంధనాన్ని అమెరికా తొలగించాలి. అదే సమయంలో సముద్రంలో ఉంచిన మందుపాతరలను తొలగించే ప్రక్రియను టెహ్రాన్‌ ఆధ్వర్యంలో చేపట్టాలని పేర్కొన్నారు.

వివరాలు 

మూడోదశలో పొరుగున ఉన్న అరబ్‌ దేశాలతో వ్యూహాత్మక చర్చలు

రెండో దశలో నిర్దిష్ట కాలం తర్వాత యురేనియం శుద్ధిని 3.6శాతం వరకు మాత్రమే తిరిగి ప్రారంభించనున్నట్లు ఇరాన్‌ తెలిపింది. తమభూభాగంలోని అణు మౌలిక వసతులను ధ్వంసం చేయడానికి అంగీకరించదని స్పష్టం చేసింది. ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ దాడులు చేయకూడదని,అలాగే టెహ్రాన్‌ కూడా దాడులకు దిగకూడదని ప్రతిపాదించింది. జప్తు చేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలని కోరింది. మూడోదశలో పొరుగున ఉన్న అరబ్‌ దేశాలతో వ్యూహాత్మక చర్చలు నిర్వహించాలని నిర్ణయించింది. పశ్చిమాసియా ప్రాంత భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించనుంది. భవిష్యత్తులో మళ్లీ దాడులు చేయబోమని ఇరాన్‌కు అమెరికా హామీ ఇవ్వాలనే అంశాన్ని కూడా ప్రణాళికలో చేర్చింది. అమెరికా ముందుగా సూచించిన తొమ్మిది అంశాల ప్రతిపాదనకు ప్రతిగా ఈప్రణాళికను టెహ్రాన్‌ రూపొందించింది.

వివరాలు 

వేరే నౌకలు వెళ్లొచ్చు: ఇరాన్

ఇదిలా ఉండగా, హర్మూజ్‌ సమీపంలో భారీ ట్యాంకర్‌పై చిన్న పడవల ద్వారా దాడి జరిగినట్లు బ్రిటన్‌ సైన్యానికి చెందిన యునైటెడ్‌ కింగ్డమ్‌ సముద్ర వాణిజ్య కార్యకలాపాల కేంద్రం వెల్లడించింది. ఈ ఘటన ఇరాన్‌లోని సిరిక్‌ తీర ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ట్యాంకర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. దాడి వెనుక ఎవరు ఉన్నారో ఇంకా తెలియరాలేదు. హర్మూజ్‌ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతోందని ఇరాన్‌ అధికారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు మినహా ఇతర దేశాల నౌకలు రుసుము చెల్లించి ఈ మార్గంలో ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

భారత్‌కు వస్తూ.. హర్మూజ్‌ను దాటిన ఎల్‌పీజీ ట్యాంకర్

హర్మూజ్‌ ద్వారా రుసుముల వసూళ్లతో ఇరాన్‌ ఇప్పటివరకు తక్కువ మొత్తమే సంపాదించిందని, చమురు ఆదాయంతో పోలిస్తే అది చాలా తక్కువని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్‌ కరెన్సీ విలువ మరింత పడిపోయి, ఒక డాలరుకు 18.40 లక్షల రియాళ్లుగా నమోదైంది. ఇక భారత్‌కు 46,313 టన్నుల ద్రవీకృత వాయువును తీసుకువస్తున్న 'ఎంటీ సర్వ్‌ శక్తి' అనే ట్యాంకర్‌ హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటి ప్రయాణం కొనసాగించింది. మార్షల్‌ దీవుల జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక ఈ నెల 13న విశాఖపట్నం తీరానికి చేరుకోనుంది.

Advertisement

వివరాలు 

ఇరాన్‌ ఇంకా మూల్యం చెల్లించుకోలేదు: ట్రంప్

ఇరాన్‌ తాజా ప్రణాళికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌ నాయకులు తాను అంగీకరించలేని అంశాలను కోరుతున్నారని చెప్పారు. గత 47 ఏళ్లలో ప్రపంచానికి కలిగించిన నష్టానికి సరిపడా మూల్యం ఇంకా చెల్లించలేదని విమర్శించారు. అయినప్పటికీ ఇరాన్‌పై భారీ స్థాయి దాడులకు దిగకుండా ఉండడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

Advertisement