Page Loader
US-Iran: ట్రంప్ ఘన విజయం ఇరాన్‌పై భారీ ఎఫెక్ట్.. ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ 
ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ

US-Iran: ట్రంప్ ఘన విజయం ఇరాన్‌పై భారీ ఎఫెక్ట్.. ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2024
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయాన్ని సాధించడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవడంతో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ తగ్గిపోయింది. బుధవారం రోజున ఇరాన్ కరెన్సీ రియాల్ యూఎస్ డాలర్‌తో పోలిస్తే 7,03,000 స్థాయికి పడిపోయింది, ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. 2015లో ఒక డాలర్‌కు 32,000 రియాల్ ఉండగా, ఇప్పుడు ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ విలువ మరింత పడిపోయింది. మీడియా కథనాల ప్రకారం, అమెరికా ఎన్నికల ఫలితాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని వివరించింది.

వివరాలు 

అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు జారీ

మే నెలలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, మసౌద్ పెజెష్కియన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణస్వీకార సమయంలో రియాల్ విలువ డాలర్‌తో పోలిస్తే 584,000కి పడిపోయింది. ట్రంప్ విజయంతో ఈ విలువ మరింతగా పతనమైంది. ఇరాన్ అధికార ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ మీడియా కథనాలను కొట్టిపారేశారు, ట్రంప్ ఎన్నిక కారణంగా రియాల్ విలువ తగ్గడం లేదని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ కూడా హమాస్, హిజ్బుల్లా, యెమెన్ యుద్ధాల్లో చిక్కుకుంది. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేసింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది.