Iran rial: 'ట్రంప్' దెబ్బ.. రికార్డు స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. డాలరుకు 8.50లక్షల రియాల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న చర్యల వల్ల అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆయన నిర్ణయాలు ముఖ్యంగా ఇరాన్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి.
ముఖ్యంగా అణ్వాయుధ నిర్మాణం వైపు అడుగులేస్తున్న టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ చేపట్టిన చర్యలు ఆ దేశ కరెన్సీ (Iran currency)ను చరిత్రలోనే అత్యల్ప స్థాయికి దిగజారేలా చేశాయి.
తాజా పరిస్థితిలో, అమెరికన్ డాలరుతో పోలిస్తే, ఇరాన్ రియాల్ విలువ 8,50,000కి పడిపోయింది.
వివరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి రియాల్ విలువ 7,03,000కి
ఇరాన్ అణ్వాయుధ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఆ దేశ చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలని, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను అమలు చేయాలని పిలుపునిచ్చారు.
అయితే, టెహ్రాన్‌తో ఒప్పందానికి రానున్న అవకాశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కానీ, ఈ అంశంపై ట్రంప్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఇరాన్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
అణ్వాయుధ కార్యక్రమాల కారణంగా గత కొన్నేళ్లుగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూనే ఉంది.
2015లో అమెరికాతో అణు ఒప్పందం కుదిరే సమయానికి ఒక డాలర్‌కు 32,000 రియాల్స్ ఉండగా,ఆ తర్వాత పరిస్థితి మారింది.
ముఖ్యంగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి రియాల్ విలువ 7,03,000కి చేరింది. ప్రస్తుతం ఇది మరింత క్షీణించి 8,50,000 రియాల్స్ వరకు పడిపోయింది.