LOADING...
Ayatollah Ali Khamenei: 'ఇరాన్ లొంగిపోదు'.. ఇజ్రాయెల్‌ దాడుల వేళ రాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ వీడియో సందేశం
ఇజ్రాయెల్‌ దాడుల వేళ రాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ వీడియో సందేశం

Ayatollah Ali Khamenei: 'ఇరాన్ లొంగిపోదు'.. ఇజ్రాయెల్‌ దాడుల వేళ రాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ వీడియో సందేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడి తీవ్రమైన పొరపాటని, ఈ చర్యకు తగిన శిక్ష తప్పదని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఈ దాడుల సమయంలో ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఖమేనీ మాట్లాడుతూ, ఇరాన్‌ ఎలాంటి పరిస్థితుల్లోనూ లొంగదన్న సత్యాన్ని ఇజ్రాయెల్‌ గ్రహించాలని అన్నారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గతంలో చేసిన హెచ్చరికలపై ప్రస్తావిస్తూ, అలాంటి బెదిరింపులకు భయపడే స్వభావం ఇరాన్‌కు లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌ చరిత్రను గమనించిన వారు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు.

వివరాలు 

యుద్ధం పశ్చిమాసియావైపు విస్తరిస్తుంది..! 

ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో, అమెరికా జోక్యం కలగజేసుకుంటే అది పశ్చిమాసియాలో పెద్ద యుద్ధానికి దారితీస్తుందన్న హెచ్చరికను ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణలపై స్పందించని ఆయన, తొలిసారిగా ప్రకటన చేస్తూ, తమపై జరిపే దాడులకు తగిన ప్రతిస్పందన ఇస్తామని స్పష్టంగా తెలిపారు.

వివరాలు 

ట్రంప్ వ్యాఖ్యలకు ఖమేనీ కౌంటర్ 

ఇరాన్‌ సుప్రీం లీడర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవలే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు సమాచారం ఉందని, ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇప్పట్లో ఆయనను హతమర్చే ఆలోచన లేదని కూడా తెలిపారు. ఇరాన్‌ తక్షణం, యుద్ధావకాశం లేకుండా పూర్తిగా లొంగిపోవాలని ట్రంప్‌ గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో, ఖమేనీ ఈ వీడియో సందేశం ద్వారా తన కౌంటర్‌ను ఇచ్చారు. ఇరాన్‌ లొంగే జాతి కాదన్న ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి.