Iraq-Israel : ఇరాక్ డ్రోన్ల దాడి.. నేలకూల్చిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి ఉన్నా, ఉల్లంఘనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాక్ వైపు నుంచి ఇజ్రాయెల్ వైపు రెండు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ పేర్కొంది. మధ్యధరా సముద్రంలోని నేవీ మిస్సైల్ బోటు సాయంతో ఈ డ్రోన్లను నేలకూల్చినట్లు స్పష్టంచేసింది. డ్రోన్లను తూర్పు నుంచి ప్రయోగించారని, ఇది ఇరాక్‌కు సంకేతంగా ఉన్న కోడ్ అని అధికారులు వివరించారు. అయితే ఈ ఘటన సమయంలో ఎలాంటి సైరన్లు మోగలేదని పేర్కొన్నారు. ఇక ఇరాన్ నుంచి వచ్చిన మరో అనుమానాస్పద డ్రోన్‌ను ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దళం కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ మరింత అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.
సైనిక బలగాలు వెనక్కి తగ్గేందుకు 60 రోజుల గడువు
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా యుద్ధానికి కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన లెబనాన్ సరిహద్దు ప్రాంత ప్రజలు, కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ దక్షిణ భాగంలోని ప్రజలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లినవారు కాల్పుల విరమణ నివేదిక వచ్చే వరకు తమ సొంత గ్రామాలకు తిరిగి రావద్దని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. సరిహద్దు గ్రామాల నుండి ఇజ్రాయెల్ సైనిక బలగాలు పూర్తిగా వెనక్కి తగ్గేందుకు 60 రోజుల గడువు ఉంది. ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా, సరిహద్దు పరిస్థితులు ఇంకా అనిశ్చితిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.