Page Loader
Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం

Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
11:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. హమాస్‌ ప్రకటన ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదల అంశాలకు సంబంధించి మధ్యవర్తులచే ప్రతినిధి బృందం సమ్మతి తెలిపింది. ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఒప్పందంతో 15నెలలుగా కొనసాగుతున్న తీవ్ర పోరాటానికి ముగింపు పలకనున్నారు. ఈ ఒప్పందం మొదటగా 6వారాల పాటు అమలులో ఉంటుంది.ఈ క్రమంలో,ఇజ్రాయెల్‌ బలగాలు గాజాను క్రమంగా వీడుతాయి. ఖతార్‌ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించింది. కొన్నినెలలుగా ఈజిప్టు, ఖతార్‌ ఇరు పక్షాలతో చర్చలు నిర్వహించాయి. ఈఒప్పందానికి అమెరికా కూడా మొదటి నుంచే మద్దతు తెలిపింది.

వివరాలు 

ఇజ్రాయెల్‌ దాడుల్లో 46,000 మందికి పైగా పాలస్తీనీయులు మృతి 

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సమయంలో, ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్‌ సార్‌ తన యూరప్‌ పర్యటనను అర్ధాంతరంగా ముగించి, సెక్యూరిటీ కేబినెట్‌ సమావేశంలో పాల్గొనేందుకు స్వదేశానికి బయలుదేరారు. 2023 అక్టోబర్‌ 7న, హమాస్‌ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరులు మరణించగా, 250 మందిని హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా తీసుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, హమాస్‌పై ఇజ్రాయెల్‌ తీవ్రమైన దాడులు చేసింది. హమాస్‌ అగ్రనేత ఇస్మాయెల్‌ హనియా, అక్టోబర్‌ 7 దాడులకు సూత్రధారి యహ్యా సిన్వార్‌తో పాటు పలువురు కీలక నేతలను హతమార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో 46,000 మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు.