Palestine : ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీలు మరణించారన్న పాలస్తీనా.. గాజాలో సేఫ్టీ లేదన్న యూఎన్
ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని పాలస్తీనా విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన దాడి "ప్రతీకార యుద్ధం"మేనని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్,కాల్పుల విరమణ ప్రకటించాలని మంత్రి రియాద్ అల్ మలికి పిలుపునిచ్చారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడులను కొనసాగిస్తున్నందున, హింసాత్మక సరిహద్దు దాడుల్లో హమాస్ బందీలుగా పట్టుకున్న దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. పాలస్తీనా టెర్రర్ గ్రూప్, హమాస్ అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై ఆకస్మికంగా విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య రణరంగం ప్రారంభించింది. ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనలో 1,400 మంది చనిపోగా, వైమానిక దాడుల కారణంగా 7,000 మందికిపైగా గాజాలో మరణించారు.
సరిహద్దుకు సమీపంలో మరిన్ని దాడులు చేస్తే పెరగనున్న మరణాలు
గాజాలోని హమాస్-నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ దళాలు దాడికి దిగితే మరణాలు మరిన్ని సంభవించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై పాలస్తీనాలోని ఐక్యరాజ్య సమితి హ్యుమానిటేరియన్ కోఆర్డినేటర్, లిన్నే హేస్టింగ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా నగరంలోని ప్రజలందరినీ ఖాళీ చేయమని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు చేసినప్పటికీ, అవి గాజా ప్రజలపై తక్కువ ప్రభావాన్ని చూపాయన్నారు. ఓ వైపు ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలింపు మార్గాలపై బాంబుల మోత మోగినప్పుడు ప్రజలకు అసాధ్యమైన ఎంపికలు తప్ప మరేమీ మిగలవని ఆమె అన్నారు. గాజాలో ఎక్కడా సురక్షితం లేదని, అక్కడ ప్రజలకు సెఫ్టీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.