ISRAEL: గాజా వీధుల్లో భీకర యుద్ధం.. కాల్పుల విరమణను మరోసారి తిరస్కరించిన నెతన్యాహు
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా ఐడీఎఫ్ దళాలు గాజా నగర వీధుల్లో భీకర కాల్పులు జరుపుతున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బందీలను విడిచిపెట్టకుండా కాల్పుల విరమణను ప్రకటించేది లేదని మరోసారి స్పష్టం చేశారు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని ప్రధాని నెతన్యాహు నొక్కి చెప్పారు. మరోవైపు గాజా నగరాన్ని తిరిగి ఆక్రమించుకోకూడదని అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌ను కోరారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధాల మధ్య ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే గాజాలో పోరు తీవ్రరూపం దాల్చడంతో, ఎదురుకాల్పుల్లో చిక్కుకోకుండా వేలాది మంది పౌరులు పారిపోతున్నారు.
అంతర్జాతీయ సమాజం పిలుపులను పక్కనపెట్టేసిన ఇజ్రాయెల్
ఇదే సమయంలో ఇజ్రాయెల్ భూ బలగాలు మంగళవారమే నగరం నడిబొడ్డులో అడుగుపెట్టాయి. అయితే హమాస్, ఇజ్రాయెల్ వైపు భారీ నష్టాన్ని కలిగించిందని ఆ దేశం పేర్కొంది. ఓ వైపు పెరుగుతున్న హింస, మరోవైపు కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం, ఇరాన్ వంటి దేశాల పిలుపులను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించడం గమనార్హం. తాము అన్ని రకాల దిశల నుంచి వింటున్న పనికిమాలిన సలహాలు, సూచనలను పక్కన పెట్టాలనుకుంటున్నామని బెంజమిన్ నెతాన్యాహు అన్నారు. ఈ సందర్భంగా ఓ స్పష్టమైన విషయాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నామన్నారు. తమ బందీలను విడుదల చేయకుండా కాల్పుల విరమణ ఉండదని నెతన్యాహు తేల్చి చెప్పడం కొసమెరుపు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.