గాజాలో హమాస్‌పై రెండో దశ యుద్ధాన్ని ప్రకటించిన నెతన్యాహు
గాజాలో చేస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం రెండో దశలోకి ప్రవేశించిందని నెతన్యాహు ప్రకటించారు. టెల్ అవీవ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. అదనపు ఇజ్రాయెల్ బలగాలు గాజా స్ట్రిప్‌లోకి వెళ్లాయని చెప్పారు. తమ బలగాలు భూమి పైన, సొరంగాల్లో ఉన్న హమాస్ ఉగ్రవాదులను నాశనం చేస్తామని నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం ఉత్తర గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు చెందిన 150 భూగర్భ లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు నెతన్యాహు చెప్పారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరువైపులా 9,000 మందికి పైగా మరణించారు.
బంధీల కుటుంబ సభ్యులతో నెతన్యాహు భేటీ
గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌ను విస్తరించాలని వార్ క్యాబినెట్, భద్రతా క్యాబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రజలు తమ వెంట ఉన్నారన్న ధైర్యంతో సైనికులు ఇప్పుడు శత్రు భూభాగంలో పోరాడుతున్నారన్నారు. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం వెలుపల హమాస్ చేతిలో బంధీలుగా ఉన్నవారి కుటంబ సభ్యులతో నెతన్యాహు సమావేశమయ్యారు. బంధీలను విడిచిపెట్టడానికి హమాస్ డిమాండ్లపై చర్చలు జరపడానికి లేదా యుద్ధాన్ని నిలిపివేయడం గురించి ఎలాంచి నిర్ణయం తీసుకోలేదని వారితో నెతన్యాహు చెప్పినట్లు తెలుస్తోంది. గతవారం, గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల దాదాపు 50మంది బందీలు చనిపోయినట్లు హమాస్ పేర్కొంది.