హమాస్ టార్గెట్.. వెస్ట్ బ్యాంక్ జెనిన్ మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
గాజాలోని వెస్ట్ బ్యాంక్ జెనిన్‌లోని మసీదు సముదాయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం వైమానిక దాడులు చేసింది. హమాస్ మిలిటెంట్లు ఈ సముదాయాన్ని స్థావరంగా దాడి చేసుకొని దాడులు చేస్తున్నట్లు అనుమానించిన ఇజ్రాయెల్.. ఆ ప్రాంతంపై రాకెట్లతో విరుచుకపడింది. ఈ దాడిలో హమాస్, ఇస్లామిక్ జిహాద్‌లకు చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడి వల్ల జెనిన్ శరణార్థి శిబిరంలోని ఇద్దరు పాలస్తీనా వైద్యులు మరణించినట్లు, పలువురు పౌరులు గాయపడినట్లు హమాస్ వర్గం చెబుతోంది. ఇదే సమయంలో గాజా స్ట్రిప్‌పై ఆదివారం నుంచి ఉద్ధృతంగా దాడులు చేయనున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్‌పై యుద్ధం ఇప్పడు వేరే లెవల్‌లో ఉంటుందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి వెల్లడించారు.
కాల్పుల విరమణకు ఐరాస చీఫ్ డిమాండ్
గాజా ప్రజలకు ఐక్యరాజ్య సమితి పంపిన 20ట్రక్కుల మానవతా సాయాన్ని శనివారం ఈజిప్ట్ రఫా సరిహద్దు ద్వారా అనుమతించింది. రఫా క్రాసింగ్ ద్వారా గాజాలో 22వేల మందికి నీటిని అందించినట్లు యునిసెఫ్ తెలిపింది. మొత్తం 44 వేల వాటర్ బాటిళ్లను ప్రజలకు అందించామని చెప్పింది. ఈ మానవతా సాయం అందిన కొద్ది గంటలకే హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ మాత్రం.. యుద్ధాన్ని ఆపేందుకు సుముఖత చూపడం లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హర్జీ హలావి మాట్లాడుతూ.. హమాస్‌ను నిర్మూలించి తీరుతామని స్పష్టం చేశారు.