Page Loader
Khamenei: 'సుఖంగా ఉండనీయము'.. ఇజ్రాయెల్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక 
ఇజ్రాయెల్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక

Khamenei: 'సుఖంగా ఉండనీయము'.. ఇజ్రాయెల్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ఉద్రిక్తతలు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో.. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడులను ఆయన "యుద్ధ ప్రకటన"గా అభివర్ణించారు. ఈ దాడులకు సముచితంగా సైనిక బలంతో స్పందిస్తామని ఖమేనీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ను ప్రశాంతంగా ఉండనివ్వమని హెచ్చరిస్తూ, "మా శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఇలాంటి దాడులకు గట్టి ప్రతిఫలాలు ఎదురవుతాయి" అంటూ ఆయన టెహ్రాన్‌లో జరిగిన సమావేశంలో స్పష్టంగా హెచ్చరించారు.

వివరాలు 

ఇజ్రాయెల్ దాడులు - ఆపరేషన్ రైజింగ్ లయన్ 

2025 జూన్ 13న రాత్రి, ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF)"ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరుతో ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని కీలక అణు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు సాగాయి. ఇస్ఫహాన్‌లో ఉన్న నటాంజ్ అణు అభివృద్ధి కేంద్రం, యురేనియం శుద్ధి ఏర్పాట్లు భారీగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని గట్టి దెబ్బకొట్టామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ దాడుల్లో, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) కమాండర్ హొస్సేన్ సలామీ, సైనిక స్టాఫ్ చీఫ్ మొహమ్మద్ బఘేరీతో పాటు మరికొంతమంది సీనియర్ సైనికాధికారులు మరణించారని IDF వెల్లడించింది. మరణించిన వారిలో తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు ఉన్నారు.

వివరాలు 

ఇరాన్ ప్రతీకారం - బాలిస్టిక్ మిసైళ్లతో ప్రతిస్పందన 

ఈ దాడులకు ప్రతీకారంగా,ఈ రోజు( 2025 జూన్ 14) తెల్లవారుజామున ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలెంపై బాలిస్టిక్ క్షిపణులతో ప్రత్యుత్తరం ఇచ్చింది. టెల్ అవీవ్‌లోని రమత్ గాన్ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో ఏడుగురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే వీరి గాయాలు స్వల్పమైనవేనని సమాచారం. ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ద్వారా ఈ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడులు తమ ప్రతీకారం ప్రారంభ దశ అని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.