Page Loader
Israel-Hezbollah War:హెజ్‌బొల్లాకు మానవ కవచాలుదుగా మారొద్దు.. లెబనాన్‌ పౌరులకు నెతన్యాహు హెచ్చరిక.. 
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 492మంది మృతి

Israel-Hezbollah War:హెజ్‌బొల్లాకు మానవ కవచాలుదుగా మారొద్దు.. లెబనాన్‌ పౌరులకు నెతన్యాహు హెచ్చరిక.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్‌-ఇజ్రాయెల్‌ పోరుతో పశ్చిమాసియా మరోసారి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ దక్షిణ లెబనాన్‌పై తీవ్రమైన దాడులు చేసింది. సైదా, మరజుయాన్, టైర్, జహరా ప్రాంతాలతో పాటు బెకా లోయలోని జిల్లాలను యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించాయి. ఈ పరిణామంతో ప్రజలు ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దాడుల నేపథ్యంలో, లెబనాన్‌ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఓ సందేశం జారీ చేశారు. హెజ్‌బొల్లాకు మానవ కవచాలుగా మారొద్దని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

హెజ్‌బొల్లా కారణంగా మీ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దు:  నెతన్యాహు 

''మా యుద్ధం మీతో కాదు.. అది హెజ్‌బొల్లాతోనే..! చాలా కాలంగా హెజ్‌బొల్లా మిమ్మల్ని మానవ కవచాలుగా ఉపయోగించుకుంటోంది. మీ ఇళ్లలోనే రాకెట్లు, క్షిపణులను దాచిపెడుతోంది. ఈ ఆయుధాలతో మా నగరాలు, మా పౌరులను టార్గెట్‌ చేస్తోంది. మా ప్రజలను రక్షించుకోవడానికి హెజ్‌బొల్లాపై దాడులు చేయాల్సి వస్తోంది. మీ ఇళ్లలో దాచిన ఆయుధాలను నిర్వీర్యం చేయడం తప్పనిసరి. హెజ్‌బొల్లా కారణంగా మీ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దు. లెబనాన్‌ను నాశనం చేయనివ్వొద్దు. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి ఇప్పుడే బయటపడండి. మా హెచ్చరికలను తీవ్రంగా పరిగణించండి. మా ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత మీ ఇళ్లకు సురక్షితంగా తిరిగి రావచ్చు'' అని నెతన్యాహు చెప్పారు.

వివరాలు 

490కు పైగా మరణాలు... 

లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు త్వరగా ఆగే సూచనలు కనిపించడంలేదు. హెజ్‌బొల్లా ఆయుధాలు దాచిన బెకా లోయను పూర్తిగా ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్‌ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో బెకా లోయలోని ప్రజలు ఆయుధాలు దాచిన ప్రాంతాలను వదిలి వెంటనే వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డానియెల్‌ హగారీ సూచించారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 492 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు, వీరిలో 90 మంది పైగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇంకా 1600 మందికి పైగా గాయపడ్డారు. లెబనాన్‌పై ఈ రకమైన తీవ్రమైన దాడులు 2006లో జరిగిన ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.

వివరాలు 

 9,000కు పైగా రాకెట్లు 

గత ఏడాది అక్టోబర్‌లో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హెజ్‌బొల్లా కూడా ఇందులో భాగస్వామిగా మారింది. ఇప్పటివరకు, ఇజ్రాయెల్‌పై దాదాపు 9,000కు పైగా రాకెట్లు ప్రయోగించింది. కేవలం సోమవారం రోజునే 250కి పైగా రాకెట్లతో దాడి చేయగా, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అవి అడ్డగించింది.