పాకిస్థాన్‌లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా?
చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆసక్మికంగా చేపట్టిన పాకిస్థాన్ పర్యటన సంచలనంగా మారింది. జాక్ మా పాక్ పర్యటనను బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్(బీఓఐ) మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ ధృవీకరించినట్లు పాకిస్థాన్ దిన పత్రిక 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' పేర్కొంది. జాక్ మా జూన్ 29న లాహోర్‌కు వచ్చి 23గంటలపాటు ఉన్నారని అజ్ఫర్ అహ్సన్ పేర్కొన్నారు. జాక్ మా పాకిస్థాన్ పర్యటనను ఆ దేశ ప్రభుత్వ అధికారులు మీడియాతో పంచుకోలేదు. ఆయన ఒక ప్రవేటు ప్రదేశంలో బస చేశారు. అలాగే జూన్ 30న జెట్ ఏవియేషన్‌కు చెందిన వీపీ- సీఎంఏ పేరుతో రిజిస్టర్ చేసిన ప్రైవేట్ విమానంలో ఆయన పాకిస్థాన్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.
వ్యాపార వేత్తలు, వాణిజ్య సంస్థలతో జాక్ మా సమావేశం
జాక్ మా పర్యటనను ఆ దేశం గోప్యంగా ఉంచినప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది పాకిస్థాన్‌కు సానుకూల ఫలితాలను ఇస్తుందనే ఆశతో దాయాది దేశం ఉంది. జాక్ మాతో కలిపి మొత్తం ఏడుగురు వ్యాపారవేత్తల బృందం పాకిస్థాక్‌కు వెళ్లారు. అందులో ఐదుగురు చైనీయులు, ఒక డానిష్ వ్యక్తి, ఒక యూకే ప్రతినిధి ఉన్నారు. వీరు హాంకాంగ్ నుంచి ప్రత్యేక విమానంలో నేపాల్ మీదుగా పాకిస్థాన్ చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జాక్ మా బృందం పాక్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించడం కోసమే వచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జాక్ మా తన పర్యటన సందర్భంగా వాణిజ్య కేంద్రాల సందర్శన, ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ వాణిజ్య ఛాంబర్‌ల అధికారులతో సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది.