Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 13కి చేరిన మృతుల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ దక్షిణ పశ్చిమ ద్వీపం క్యూషూలో సంభవించిన 7.1తీవ్రత భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 13మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రధాని సనా తకైచి వెల్లడించారు. పలువురు గాయపడగా,మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక బృందాలు రాత్రింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పలువురి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:27 గంటలకు కూమమోటో ప్రాంతాన్ని భూకంపం తాకింది. జపాన్ శిండో భూకంప తీవ్రత ప్రమాణంలో గరిష్ఠ స్థాయి అయిన '7' నమోదైంది. టోక్యోకు సుమారు 900కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలతో అనేక భవనాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చెలరేగాయి.భారీ సంఖ్యలో ప్రజలు విద్యుత్,తాగునీటి సౌకర్యాలు కోల్పోయారు.
వివరాలు
నిప్పాన్ పేపర్ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో నేలమట్టమైన భారీ చిమ్నీ
కూమమోటోలోని ఓ షాపింగ్ సెంటర్‌లో గ్యాస్ లీక్ జరిగిన తర్వాత భవనం భాగం కూలిపోయిందని అధికారులు తెలిపారు.
యాట్సుషిరోలో ఉన్న నిప్పాన్ పేపర్ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో భారీ చిమ్నీ నేలమట్టమైంది.
ఇద్దరు కార్మికులను ఆస్పత్రికి తరలించగా,మరో తొమ్మిది మంది కోసం గాలింపు కొనసాగుతోంది.
భూకంపం తర్వాత కూమమోటో ప్రిఫెక్చర్‌లోని ఐయాన్ షాపింగ్ మాల్‌లో పేలుడు చోటుచేసుకుంది.
సుమారు 200దుకాణాలు ఉన్న ఈ మాల్‌ను తొలి ప్రకంపనల తర్వాత ఖాళీ చేయించారు.
ఈ ఘటనలో 20ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.మరో వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.
పేలుడుకు అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదని ఐయాన్ ప్రతినిధి వెల్లడించారు.గ్యాస్ లీక్‌పై అధికారులు అనుమానం వ్యక్తం చేసినా,దానిపై పూర్తి స్పష్టత రాలేదు.
వివరాలు
60కుపైగా ఆఫ్టర్‌షాక్‌లు నమోదు
భూకంపం తర్వాత కూమమోటో, సమీప నగసాకి ప్రిఫెక్చర్‌లలో కలిపి 2.60 లక్షల మందికిపైగా ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.
తొలుత జారీ చేసిన సునామీ హెచ్చరికను రెండు గంటల తర్వాత ఉపసంహరించారు.
జపాన్ వాతావరణ శాఖ తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు బలమైన ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇప్పటివరకు 1 నుంచి 4 తీవ్రత మధ్య 60కుపైగా ఆఫ్టర్‌షాక్‌లు నమోదయ్యాయి.
వివరాలు
350 మందికిపైగా వైద్యసాయం
మంగళవారం రాత్రి నాటికి 50వేల కుటుంబాలు విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
దాదాపు 1.40లక్షల మందికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జపాన్ రక్షణ శాఖ 3,600మంది సైనికులను సహాయక చర్యలకు పంపింది.
నష్టం అంచనా కోసం 20విమానాలను గగనతలం నుంచి పరిశీలనకు వినియోగించింది.
సమీప ప్రాంతాల నుంచి అత్యవసర సిబ్బంది కూడా ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు.
ప్రాంతంలోని ఆస్పత్రుల్లో వందలాది మందికి చికిత్స అందుతోంది. స్థానిక సమాచారం ప్రకారం 350 మందికిపైగా వైద్యసాయం పొందారు.
భవనాల శిథిలాల కింద చిక్కుకుని గాయపడినవారు,కాలిన గాయాలు,ఎముకలు విరిగిన బాధితులు వరుసగా ఆస్పత్రులకు చేరుతున్నారని ఓ ఆస్పత్రి ఉద్యోగి ఎన్‌హెచ్‌కేతో తెలిపారు.
ఆస్పత్రిలో కూడా నీటి లీకేజీలు,విద్యుత్ వ్యవస్థలో సమస్యలు ఏర్పడినట్లు చెప్పారు.
వివరాలు
KDDI, NTT డోకోమో మొబైల్ సేవలకు అంతరాయం
విద్యుత్ కొరత, ప్రసార వ్యవస్థ దెబ్బతినడంతో KDDI, NTT డోకోమో మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించాయి.
పరిస్థితి దృష్ట్యా TSMC, సోనీ, ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఫ్యాక్టరీల నుంచి ఉద్యోగులను ముందస్తు జాగ్రత్తగా బయటకు తరలించాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సనా తకైచి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే గాయపడిన వారి సమాచారం అందుతోందని, పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు, అగ్నిప్రమాదాలు, రహదారులు, వంతెనలు దెబ్బతినడం,భవనాలు కూలిపోవడం వంటి ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆమె కోరారు.