Jensen Huang: నా పునరాగమనం వెనుక ట్రంప్ లేరు: ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
చిప్‌ల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థ ఎన్విడియా అధినేతగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంపై వివాదం కొనసాగుతోంది. తన పునర్నియామకం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని హువాంగ్ స్పష్టం చేశారు. ఎన్విడియా బోర్డు సభ్యులు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్నాకే తనను తిరిగి నియమించారని వెల్లడించారు. అయితే, ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భిన్నమైన వాదన వినిపించారు. తానే స్వయంగా ఎన్విడియా బోర్డు సభ్యులతో మాట్లాడి, జెన్సన్ హువాంగ్‌ను తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవాలని ఒప్పించానని చెప్పారు.
వివరాలు
హువాంగ్ వ్యాఖ్యలకు, ట్రంప్ వాదనకు మధ్య భిన్నాభిప్రాయాలు
ఈ విషయాన్ని 'సీఎన్‌బీసీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. "నేను వారితో మాట్లాడాను. వారిని ఒప్పించాను" అని ట్రంప్ పేర్కొన్నారు.
దీంతో హువాంగ్ వ్యాఖ్యలకు, ట్రంప్ వాదనకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు, ముఖ్యంగా చైనాకు చెందిన ఓ నిఘా సంస్థ ఏజెంట్‌తో సంబంధం ఉందన్న వార్తలు వెలుగులోకి రావడంతో ఈ నెల ప్రారంభంలో హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఎన్విడియాను సహ-స్థాపించిన ఆయన, సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
వివరాలు
జెన్సన్ నియామకంపై అమెరికా చట్టసభ సభ్యుల విమర్శలు
ఇదిలా ఉండగా,ఉద్యోగులతో హువాంగ్ దురుసుగా ప్రవర్తిస్తారంటూ వచ్చిన కథనాలపైనా ఆయన స్పందించారు.
తన ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూనే, మీడియాలో వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.
అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే హువాంగ్‌ను తిరిగి నియమించాలనే నిర్ణయం తీసుకున్నామని ఎన్విడియా గతంలో ప్రకటించింది.
ఈ నిర్ణయం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని బోర్డు విశ్వసిస్తోందని సంస్థ పేర్కొంది.
అయితే,ఎన్విడియా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో రాజకీయ వివాదానికి దారితీసింది.
అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు చట్టసభ సభ్యులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
హువాంగ్ పునర్నియామకం వెనుక ఉన్న పరిస్థితులు, ఆరోపణలు, భద్రతాపరమైన అంశాలపై మరింత లోతైన విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.