Joe Biden: నావల్నీ మృతికి పుతిన్ బాధ్యత వహించాలి: బైడెన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) జైలులో ఆకస్మికంగా మరణించారు. తీవ్రవాద ఆరోపణలపై నావల్నీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. జైలులో అతను మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నావల్నీ మృతికి అధ్యక్షుడు పుతిన్ బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పష్టం చేశారు. నావల్నీకి జరిగిన సంఘటన పుతిన్ క్రూరత్వానికి నిదర్శనమన్నారు. అలెక్సీ నావల్నీ మరణ వార్త విని తాను నిజంగా ఆశ్చర్యపోలేదన్నారు. కానీ ఆయన మరణంపై కోపంగా ఉన్నట్లు చెప్పారు. పుతిన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, హింసకు వ్యతిరేకంగా నావల్నీ ధైర్యంగా పోరాడన్నారు.
పుతిన్‌పై తీవ్రంగా స్పందించిన నావల్నీ భార్య
నావల్నీ భార్య యులియా నవల్నాయ కూడా పుతిన్‌పై తీవ్రంగా స్పందించారు. నావల్నీ మృతికి వ్లాదిమిర్ పుతిన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జర్మన్ నగరమైన మ్యూనిచ్‌లో 'దావోస్ ఆఫ్ డిఫెన్స్' పేరుతో నిర్వహించిన వార్షిక సమావేశానికి ఆమె హజరయ్యారు. నావల్నీ మరణ విషయం తెలిసాక.. తాను ఇక్కడికి రావాలా? వెంటనే తన పిల్లల వద్దకు వెళ్లాలా అని నేను చాలాసేపు ఆలోచించినట్లు నవల్నాయ అన్నారు. ఈ సమయంలో తన భర్త ఏం ఆలోచిస్తాడో తాను అదే ఆలోచించినట్లు పేర్కొన్నారు. అందుకే తాను సమావేశానికి వచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా అధికారులను నమ్మాలో.. లేదో.. తనకు తెలియదని నవల్నాయ అన్నారు. వారు చెప్పిందే నిజమైతే, పుతిన్, అతని అధికారులు, దేశానికి, తన కుటుంబానికి బాధ్యత వహించాలన్నారు.
రష్యాలోని అత్యంత ప్రమాదకరమైన జైళ్లలో నావల్నీ
రష్యాలో పుతిన్‌ని తీవ్రంగా విమర్శించే వ్యక్తింగా నావల్నీ గుర్తింపు పొందారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా 2021లో నవల్నీ జైలు పాలయ్యారు. అంతకుముందు కూడా నావల్నీకి విషం పెట్టి చంపే ప్రయత్నం జరిగింది. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డారు. మూడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నావల్నీ ఆచూకీ చాలా రోజుల పాటు ఎవరికీ తెలియలేదు. ఆయన లాయర్ల చొరవతో రష్యా ప్రభుత్వం నావల్నీని అత్యంత చల్లని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న జైలులో ఉంచినట్లు తెలిసింది. ఇది రష్యాలోని అత్యంత ప్రమాదకరమైన జైళ్లలో ఒకటిగా చెబుతారు. ఈ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు ఈశాన్యంలో రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.