LOADING...
Joe Biden: జో బైడెన్‌ సంచలన నిర్ణయం.. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో తన కుమారుడికి క్షమాభిక్ష
జో బైడెన్‌ సంచలన నిర్ణయం.. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో తన కుమారుడికి క్షమాభిక్ష

Joe Biden: జో బైడెన్‌ సంచలన నిర్ణయం.. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో తన కుమారుడికి క్షమాభిక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2024
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు సంబంధించి కీలకమైన రెండు క్రిమినల్‌ కేసుల్లో క్షమాభిక్ష మంజూరు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న తరుణంలో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. హంటర్‌పై ఉన్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని బైడెన్‌ పేర్కొన్నారు. తన తీరును సమర్థించుకుంటూ, "న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు నుంచే చెప్పా. కానీ, నా కుమారుడిపై అన్యాయం జరిగినప్పుడు కూడా నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఇప్పుడు, ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆవశ్యకమని భావించాను. అమెరికా ప్రజలు దీనిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను," అని పేర్కొన్నారు.

వివరాలు 

అధికారాన్ని ఉపయోగించి బైడెన్ క్షమాభిక్షను మంజూరు చేశారు 

హంటర్‌ బైడెన్‌పై మొదటగా 2018లో తుపాకీ కొనుగోలు సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన కేసు నమోదైంది. ఆయుధ డీలర్‌కు అందించిన దరఖాస్తులో డ్రగ్స్‌కు బానిసగా మారిన విషయాన్ని దాచి పెట్టారు. ఈ కేసులో న్యాయస్థానం ఇటీవల ఆయనను దోషిగా తేల్చినా, శిక్షపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, కాలిఫోర్నియాలో ఆయనపై 1.4మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేత ఆరోపణలతో కేసు నమోదైంది. గతంలో ఈ కేసులపై బైడెన్‌ తన కుమారుడికి ఎలాంటి క్షమాభిక్ష కోసం ప్రయత్నించబోనని స్పష్టం చేశారు. కానీ,అధ్యక్ష పదవీ కాలం ముగింపు సమీపిస్తున్న తరుణంలో,తన అధికారాన్ని ఉపయోగించి ఈ క్షమాభిక్షను మంజూరు చేయడం వివాదాస్పదంగా మారింది. హంటర్‌ కేసులపై బైడెన్‌ తీసుకున్న తాజా నిర్ణయం అమెరికా రాజకీయాల్లో మిశ్రమ స్పందనలకు దారితీస్తోంది.