
#NewsBytesExplainer: జర్నలిస్ట్ నుండి రాజకీయ నాయకుడిగా.. నేపాల్ యువతలో ప్రజాదరణ ఫుల్..ఎవరీ రబీ లామిచానే ?
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అక్కడి ప్రభుత్వం కూలిపోయింది, దేశాన్ని సైన్యం నియంత్రిస్తోంది. జెన్ జీ యువత చేపట్టిన ఆందోళనల్లో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు వివిధ మంత్రులు, సుప్రీంకోర్టు, మీడియా కార్యాలయాలకు నిప్పటించారు. ఈ గొడవల్లో 300 మందికి పైగా గాయపడ్డారు. దేశంలోని జైళ్లలోనూ నిరసనకారులు దూసుకెళ్లారు. అక్కడ బందీగా ఉన్న, 900 మంది ఖైదీలను విడుదల చేశారు. చివరికి, ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
వివరాలు
ప్రధాని రేసులో ఇద్దరు
ఈ పరిస్థితిలో, తదుపరి నేపాల్ ప్రధాని ఎవరు అవుతారు అనే చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం దేశాన్ని సైన్యం నడుపుతోంది. తక్షణం శాంతిని కాపాడటం సైన్యానికి ప్రధాన లక్ష్యం కాగా.. అక్కడ పరిస్థితి కొంత సద్దుమణిగాక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో,తదుపరి కొత్త ప్రధాని ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన రబీ లామిచానే, మరొకరు ఖాట్మండు మేయర్ బాలెన్ షా. ఈ ఇద్దరు జెన్ జీ యువతకు ఎంతో ఇష్టమైన నేతలుగా పేరుగాంచారు. వీరి రాజకీయ జీవితం కూడా ప్రత్యేకమైనదని, ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని చెబుతున్నారు.
వివరాలు
ఎవరీ రబీ లామిచానే ?
రబీ లామిచానే మీడియా నేపథ్యం కలిగిన నేత.జర్నలిజం రంగంతో కెరీర్ ప్రారంభించి, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. " సిద్ధ కుర జనతా సంగ్" అనే టీవీ షో ద్వారా అవినీతి,సామాజిక అన్యాయాలను ప్రజల ముందుకు తేవడం ద్వారా ఇతను ప్రజలలో అపారమైన ప్రజాదరణ పొందారు. ఈ ప్రజాదరణను ఆయన తరువాత రాజకీయాల్లో ఉపయోగించుకున్నారు. రబీ స్వతంత్ర రాష్ట్రీయ పార్టీని స్థాపించి,హోం మంత్రి,ఉప ప్రధానమంత్రిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే,నవంబర్ 2023లో,నేపాల్ సుప్రీంకోర్టు రబీని పౌరసత్వ చట్టాలు ఉల్లంఘించిన కారణంగా తన పదవుల నుండి తొలగించింది.
వివరాలు
యువతలో రబీకి అపారమైన ఆదరణ
రబీ నేపాల్ రాజకీయాల్లో కొనసాగుతూ అమెరికా పౌరసత్వాన్ని వదకలపోవడమే కాక, నేపాల్ పౌరసత్వాన్ని కూడా తిరిగి పొందలేదు. అదనంగా, సుప్రీం కోఆపరేటివ్ స్కామ్‌లో లక్షలాది నేపాలీ రూపాయల దుర్వినియోగం చేసినందుకు ఆయన అరెస్టు అయ్యారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా, యువతలో రబీకి అపారమైన ఆదరణ ఉంది. ఉపాధి సృష్టి, ఆరోగ్య సదుపాయాలు, పరిపాలనలో పారదర్శకత వంటి సామాజిక సమస్యలపై రబీ లామిచానే సమర్థవంతంగా పోరాడారు.