Justin Trudeau: కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా!
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిబరల్ పార్టీ నాయకత్వానికి, అలాగే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తరువాత మాత్రమే బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు.
ట్రూడోపై సొంత పార్టీ నాయకుల నుంచి కొంతకాలంగా రాజీనామా చేయాలనే ఒత్తిడి ఉన్న నేపథ్యంలో, ఈ ప్రకటన రావడం విశేషం.
''పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్న విషయాన్ని నేను పార్టీకి, గవర్నర్‌కు తెలిపాను. కొత్త నాయకత్వం ఎన్నుకునిన వెంటనే నా రాజీనామా అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు మార్చి 24వరకు పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నాను,'' అని ట్రూడో తెలిపారు.
వివరాలు
ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా
ఇటీవల ఆ దేశ ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆమె జస్టిన్ ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ట్రూడో కేబినెట్‌లో అత్యంత శక్తివంతురాలిగా గుర్తింపు పొందిన ఫ్రీలాండ్ రాజీనామా, ట్రూడోపై ఒత్తిడిని మరింత పెంచింది.
దాదాపు పదేళ్ళ పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్న ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీలే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.