Kazakhstan: కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం.. ప్రయాణికుడి వీడియో వైరల్
కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్తావ్ నగర సమీపంలో ఓ విమానం అకస్మాత్తుగా కుప్పకూలి మంటలు చెలరేగడంతో 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2-8243 విమానంలో జరిగింది. ఇది 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యా వైపు బయలుదేరింది. ఈ విమానం అజర్‌బైజాన్ రాజధాని బాకూ నుంచి రష్యాలోని నార్త్ కాకస్ ప్రాంతంలోని గ్రాజ్నీ నగరానికి వెళ్లాల్సి ఉండగా, ల్యాండింగ్ సమస్యల కారణంగా దారి మళ్లించబడింది. ఈ క్రమంలో అది అక్తావ్ వద్ద కూలిపోయింది.
ప్రయాణికుల భయంతో కూడిన అరుపులు
ప్రమాద సమయంలో ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రయాణికుల భయంతో కూడిన అరుపులు, విమానం కూలిన తర్వాత ప్రయాణికులు చెల్లాచెదరుగా పడిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం నుంచి 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, గురువారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.