UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇటీవల పాకిస్థాన్ పౌరులకు వీసా జారీని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్య కారణంగా పాక్ పౌరులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు యూఏఈ ప్రయాణం కష్టసాధ్యమైంది. యూఏఈలో పాక్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ ఈ నిర్ణయాన్ని అంగీకరించారు. అయితే ఈ సమస్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పాక్ పౌరులు నకిలీ పత్రాలతో ప్రయాణం, వీసా నిబంధనల ఉల్లంఘన, వంటి నేరాల ఆరోపణలున్నాయని యూఏఈ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో భద్రతా సమస్యలపై దృష్టి సారించిన యూఏఈ కేబినెట్, పాక్ పౌరులకు వీసాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.
సోషల్ మీడియాలో పాక్ పౌరులు నిరసన
ఇస్లామాబాద్‌లోని పాక్ రాయబారి కార్యాలయానికి ఈ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేశారు. యూఏఈకి వెళ్లేందుకు పాక్ పౌరులు రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్స్, కనీసం 3,000 దిర్హామ్‌లు కలిగి ఉండాల్సి ఉంటుంది. నకిలీ డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్‌లు, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని యూఏఈ అధికారులు చెబుతున్నారు. యూఏఈ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పాక్ పౌరులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి. నిరసనలు, రాజకీయం వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం యూఏఈ చట్టాలను ఉల్లంఘించే చర్యలుగా అధికారులు పేర్కొన్నారు.
నేరాల్లో ఎక్కువగా పాకిస్థాన్ పౌరులు
యూఏఈలో పాకిస్థాన్ పౌరులు తక్కువ శ్రేణి పనుల్లోనే కాకుండా, మోసం, దొంగతనాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి నేరాల్లో ఎక్కువగా పాల్గొంటున్నట్లు యూఏఈ అధికారులు ఆరోపిస్తున్నారు. భద్రతా కారణాలు, నేరాల నియంత్రణ, చట్టాల పట్ల యూఏఈ జీరో టాలరెన్స్ విధానాలు ఈ ఆంక్షల వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.