US Presidential Debate: ట్రంప్, బైడెన్‌ల మొదటి 2024 అధ్యక్ష డిబేట్ నుండి కీలకమైన అంశాలు
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి జరిగిన చర్చలో తలపడ్డారు. చర్చ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ చర్చలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. 2020 ఎన్నికల తరువాత వీరిద్దరూ తొలిసారి ముఖాముఖీ తలపడ్డారు. కొన్నిసార్లు ట్రంప్ దూకుడు ప్రదర్శించగా.. బైడెన్ కొన్నిచోట్ల తడబడ్డారు. అట్లాంటాలోని సీఎన్‌ఎన్ ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం ఈ రోజు (శుక్రవారం) ఉదయం 90 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరిగింది. వివిధ అంశాలపై ఈ ఇద్దరి నేతల అభిప్రాయాలు సంక్షిప్తంగా మీ కోసం ..
ఆర్థిక వ్యవస్థపై బైడెన్ పనితీరుపై ట్రంప్ విమర్శలు
2024 ప్రెసిడెంట్ రేసులో మొదటి చర్చలో, ట్రంప్, బైడెన్ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అయన అనుసరించిన ఆర్థిక విధానాలపై బైడెన్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ధనవంతులకు అనుకూల వైఖరిని అవలంబించారని అన్నారు. దీంతో ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిందన్నారు. ఉద్యోగ కల్పన కూడా పూర్తిగా క్షీణించిందన్నారు. నిరుద్యోగం 15 శాతానికి చేరిందన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేశ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు తనపై ఉంచారన్నారు. ఈ విషయం పై ట్రంప్ సమాధానమిస్తూ.. బైడెన్ అధ్యక్షుడిగా కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. బైడెన్ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. పన్ను కోతల వల్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు.
విదేశాంగ విధానంపై వాడీవేడిగా చర్చ
విదేశాంగ విధానంపై వారిద్దరి మధ్య వాడీవేడిగా చర్చ సాగింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అత్యంత దారుణంగా సాగినట్లు ట్రంప్ అన్నారు. ఈ ఘటన అమెరికా చరిత్రలోనే దుర్దినంగా నిలిచిపోతుందన్నారు. తన హయాంలో సైనికులు చాలా గౌరవప్రదంగా బయటకు వచ్చేలా ఏర్పాట్లుచేశామన్నారు. ట్రంప్ ఆరోపణలపై బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్ హయాంలో ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు సామాన్య పౌరులను చంపుతూనే ఉన్నారన్నారు. ఆ సమయంలో ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా అక్కడ మరణించిన అమెరికా సైనికులను ట్రంప్ దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ సందర్భంలో ఇరాక్‌లో పనిచేసి, మరణించిన తన కుమారుడు బ్యూను బైడెన్ గుర్తుచేసుకున్నారు.
వలస విధానంపై చర్చ
అంతేకాకుండా ఉక్రెయిన్-రష్యా యుద్దానికి సంబంధించి మాట్లాడుతూ.. ట్రంప్ పుతిన్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు. పైగా అనేకమంది రష్యా సైనికుల ప్రాణాలు కోల్పోడంవల్లే వారు ప్రతిదాడి చేస్తున్నారని సమర్ధించారన్నారు. ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ట్రంప్,బైడెన్ మధ్య సాగిన ఈ ముఖాముఖి చర్చలో వలస విధానం మరో కీలక అంశం అయ్యింది. అమెరికా విధానాలపై ట్రంప్ కావాలనే విష ప్రచారారాలు చేస్తున్నారన్నాని బైడెన్ ఆరోపించారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారన్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దేశ దక్షిణ సరిహద్దులను సేఫ్ గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్ తెలిపారు. దీన్ని బైడెన్ చేసిన నేరంగా తాను అభివర్ణిస్తాననన్నారు.
కీలకంగా మారిన గర్భవిచ్ఛిత్తి అంశం
ఈసారి అమెరికా ఎన్నికల్లో గర్భవిచ్ఛిత్తి అంశం చాల కీలకంగా మారింది. ప్రస్తుత డిబేట్‌లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. గర్భవిచ్ఛిత్తిని నిషేధించడాన్నిబైడెన్ తప్పుబట్టారు. దీన్ని అనుమతిస్తూ ఇచ్చిన 'రో వర్సెస్ వేడ్' తీర్పును పునరుద్ధరిస్తామని తెలిపారు. గర్భవిచ్ఛిత్తి మహిళ, వైద్యులు తేల్చాల్సిన టాపిక్ అని .. రాజకీయ నాయకులు కాదని బైడెన్ అన్నారు. ఈ టాపిక్ ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గర్భవిచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.