 
                                                                                Prince Andrew: సెక్స్ కుంభకోణంలో పేరు.. రాజకుటుంబం నుంచి ప్రిన్స్ ఆండ్రూ బహిష్కరణ!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులు మాత్రమే కాకుండా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆయన తనకు ఉన్న రాయల్ టైటిల్‌ను వదులుకున్నారు. ఈ సంఘటనల తరువాత ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ రాజు చార్లెస్ III (King Charles III) తన తమ్ముడు ఆండ్రూకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజు చార్లెస్ ఆండ్రూకు ఉన్న అన్ని బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించడంతో పాటు, ఆయనను ఇంటి నుంచి వెళ్ళగొట్టినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
వివరాలు
రాయల్ టైటిల్ 'డ్యూక్ ఆఫ్ యార్క్'
దివంగత రాణి ఎలిజబెత్ II రెండవ కుమారుడు అయిన ఆండ్రూ, జెఫ్రీ ఎప్‌స్టైన్ (Jeffrey Epstein) నిర్వహించిన సెక్స్ కుంభకోణం కేసులో పేరు వెలుగులోకి రావడంతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన తన రాయల్ టైటిల్ 'డ్యూక్ ఆఫ్ యార్క్'ను వదిలేశారు. తాజా ప్రకటన ప్రకారం, రాజు చార్లెస్ ఆయనకు ఉన్న అన్ని రాజ బిరుదులు, గౌరవాలు, హక్కులను రద్దు చేసినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. అలాగే ఆయన ప్రస్తుతం లండన్‌లోని విండ్సర్ ఎస్టేట్‌లో లీజుకు తీసుకున్న ఇల్లు కూడా ఖాళీ చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. దాంతో, ఆండ్రూ త్వరలో తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రిగ్‌హోమ్ ప్రైవేట్ ఎస్టేట్ కు మారనున్నారని సమాచారం.
వివరాలు
కుంభకోణంలోని బాధితుల వైపే రాజు చార్లెస్, రాణి కెమిల్లా
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆండ్రూ ఎన్నోసార్లు తిరస్కరించినప్పటికీ, రాజు చార్లెస్ ఈ చర్యలు అనివార్యమని భావించినట్లు ప్యాలెస్ తెలిపింది. ఈ సందర్భంగా రాజు చార్లెస్,రాణి కెమిల్లా, కుంభకోణంలో బాధితుల పక్షానే నిలబడతారని స్పష్టం చేశారు. జెఫ్రీ ఎప్‌స్టైన్ సెక్స్ కుంభకోణం అమెరికాను ఉలిక్కిపడేలా చేసిన సంఘటనగా నిలిచింది.
వివరాలు
ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసిన వర్జినియా గ్రిఫీ
ఆ కేసులో అమెరికాకు చెందిన వర్జినియా గ్రిఫీ అనే మహిళ,యువరాజు ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది. తాను 17 ఏళ్ల వయసులో ఉండగా ఆండ్రూ మూడు సార్లు తనను లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది. అయితే ఆండ్రూ ఈ ఆరోపణలను ఎప్పటిలాగే పూర్తిగా తిరస్కరించారు. తాజాగా వర్జినియా గ్రిఫీ రాసిన 'నోబడీస్ గర్ల్' (Nobody's Girl) పుస్తకం విడుదల కావడంతో, ఆండ్రూ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజ కుటుంబం ఈ తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.