Putin: ఆయుధాలు విడిచిపెట్టి, ప్రాణాలను కాపాడుకోండి.. ఉక్రెయిన్ బలగాలకు పుతిన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ రష్యాలోని కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే, వారు ప్రాణాలతో ఉంటారని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ సేనలపై కనికరం చూపించాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మానవతా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రంప్ సూచించారని, ఆయన విజ్ఞప్తి మేరకు స్పష్టంగా చెబుతున్నానని పుతిన్ పేర్కొన్నారు.
Details
అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం
ఉక్రెయిన్ బలగాలు లొంగిపోతే, వారు ప్రాణాలతో ఉంటారని, లేకపోతే అంతర్జాతీయ చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పుతిన్ హెచ్చరించారు.
రష్యా టెలివిజన్ ఈ వ్యాఖ్యలను ప్రసారం చేసింది. ఉక్రెయిన్ సేనలు పశ్చిమ రష్యాలోని కర్క్స్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు పౌరులపై నేరాలకు పాల్పడుతున్నాయని పుతిన్ ఆరోపించగా, ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. తమ సైనికుల పరిస్థితి క్లిష్టంగా ఉందని కీవ్ అధికారికంగా ప్రకటించింది.