UN climate: ఒప్పందం లేకుండానే ముగిసిన కాప్-31 వాతావరణ సదస్సు.. అసలు కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
టర్కీలో జరిగిన ఐక్యరాజ్య సమితి కాప్-31 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) వాతావరణ సదస్సు ఎలాంటి తుది ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు,శిలాజ ఇంధనాల వినియోగం, పేద దేశాలకు అందించాల్సిన ఆర్థిక సాయం వంటి అంశాలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆదివారం యూరోపియన్ యూనియన్(ఈయూ)సహా పలు దేశాలు తుది ముసాయిదాను అంగీకరించేందుకు నిరాకరించాయి. అంతాల్యాలో దాదాపు 200దేశాల ప్రతినిధుల మధ్య రెండు వారాల పాటు ఈ చర్చలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ముగియాల్సిన సదస్సు.. అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఆదివారం వరకు కొనసాగింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.దీంతో కాప్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం సాగిన వాతావరణ సదస్సుగా ఇది నిలిచింది.
వివరాలు
ఆర్థిక సాయం, శిలాజ ఇంధనాలపై దేశాల మధ్య విభేదాలు
వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు పేదదేశాలకు సంపన్న దేశాలు ఆర్థికసాయం అందిస్తామని గతంలో హామీ ఇచ్చాయి.
అయితే,ఈ నిధుల విషయంలో స్పష్టమైన హామీ లేకపోవడంపై పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
మరోవైపు శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా తగ్గించాలనే అంశంపై కూడా తీవ్ర విభేదాలు తలెత్తాయి.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సదస్సు ఫలితాలపై తీవ్రనిరాశ వ్యక్తం చేశారు.
మరోవైపు,చమురు ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చర్చలను ప్రభావితం చేశాయని ఈయూ ప్రతినిధి ఆరోపించారు.
నాలుగో ముసాయిదాలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలనే అంశాన్ని ప్రస్తావించకపోవడం దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులకు ఈ ఇంధనాల వినియోగమే ప్రధాన కారణం.
వివరాలు
కోపెన్‌హాగన్‌లోనూ కుదరని ఒప్పందం
చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన, ఉద్రిక్తమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఈ సదస్సు జరిగిందని కాప్-31 సహాధ్యక్షుడు, ఆస్ట్రేలియా మంత్రి క్రిస్ బోవెన్ తెలిపారు.
గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. 2009లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో జరిగిన కాప్ సదస్సు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
అప్పట్లో కుదిరిన ఒప్పందంలోని 11 అంశాల్లో ఏ ఒక్కటీ దేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన నిబంధనగా లేదు.
వివరాలు
కాప్-31 ఒప్పందం ఎందుకు కుదరలేదు?
యూరోపియన్ యూనియన్ తరఫున మాట్లాడిన ఐర్లాండ్ మంత్రి డారాగ్ ఓ'బ్రియన్.. తుది ఒప్పందాన్ని అధికారికంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ముసాయిదాను ఆలస్యంగా విడుదల చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, శిలాజ ఇంధనాల ప్రస్తావన లేని ముసాయిదాను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి ఒప్పందాన్ని ఆయన గ్రీన్‌వాషింగ్‌గా అభివర్ణించారు. "మా పౌరుల తరఫున ఈ విషయం చెబుతున్నాం.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన స్థాయి లక్ష్యాలకు ఈ నిర్ణయాలు కనీసం దగ్గరగా కూడా లేవు.
వాతావరణ ఒప్పందంలో శిలాజ ఇంధనాల ప్రస్తావనే లేకపోవడం ఆమోదయోగ్యం కాదు" అని డారాగ్ ఓ'బ్రియన్ అన్నారు.
వివరాలు
కాప్-31 ఒప్పందం ఎందుకు కుదరలేదు?
కొన్ని చమురు ఉత్పత్తి దేశాలు చర్చలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని కూడా ఆయన ఆరోపించారు.
ఆదివారం కాప్-31 చర్చలు తిరిగి ప్రారంభమైన సమయంలోనే ఒప్పందానికి సంబంధించిన నాలుగో ముసాయిదాను విడుదల చేశారు.
మొత్తం 12 పేజీలున్న ఈ పత్రంలోనూ శిలాజ ఇంధనాల ప్రస్తావన ఎక్కడా లేదు.
అయితే, ఈయూ దేశాలు మాత్రం ఈ అంశాన్ని ఒప్పందంలో స్పష్టంగా చేర్చాలని పట్టుబట్టాయి.
కొత్త ముసాయిదాలో 2035 నాటికి దేశాల మొత్తం ఇంధన వినియోగంలో విద్యుత్ వాటాను 35 శాతానికి పెంచుకోవాలని సూచించారు.
అలాగే, కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవడం,వాటిని వినియోగించడం, భూగర్భంలో నిల్వ చేయడం వంటి సాంకేతిక పరిజ్ఞానాల అమలుకు సంబంధించి కొన్ని స్వల్ప మార్పులు చేశారు.
వివరాలు
కాప్-31 ఒప్పందం ఎందుకు కుదరలేదు?
అయితే,ఈ సాంకేతిక పరిజ్ఞానంపై అతిగా ఆధారపడటం మరో సమస్యకు దారితీయవచ్చని ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
కార్బన్ ఉద్గారాలను నిల్వ చేసే సాంకేతికతను సాకుగా చూపి చమురు ఉత్పత్తి దేశాలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే చమురు,సహజ వాయువు వినియోగాన్ని కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ సాంకేతిక విధానంలో భాగంగా విడుదలైన కార్బన్ ఉద్గారాలను సేకరించి భూమి అడుగున నిల్వ చేస్తారు.
వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు, సీఈఓ అనీ దాస్‌గుప్తా సదస్సు ఫలితాలను డొల్లగా అభివర్ణించారు.
ఇది రాజకీయ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు."వాతావరణ మార్పులకు శిలాజ ఇంధనాలే ప్రధాన కారణమని శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. అలాంటప్పుడు వాటి ప్రస్తావన చేయడానికి కూడా దేశాలు అంగీకరించకపోవడాన్ని సమర్థించలేం"అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఐరాస ప్రధాన కార్యదర్శి ఏమన్నారు?
కాప్-31లో ఎలాంటి సమగ్ర ఒప్పందం కుదరకపోవడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
అయితే, ఈ వైఫల్యం వల్ల వాతావరణ మార్పులకు సంబంధించిన శాస్త్రీయ వాస్తవాలు మారవని స్పష్టం చేశారు.
"ఈ ఎదురుదెబ్బతో వాస్తవాలు మారిపోవు. చర్చల వేదికపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా, శాస్త్రీయ పరిశోధనల ఫలితాల విషయంలో ఎలాంటి సందేహాలూ లేవు" అని ఆయన అన్నారు.
వాతావరణ మార్పులపై చర్యలను అడ్డుకుంటున్న శక్తిమంతమైన శిలాజ ఇంధన కంపెనీలను, వాటి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంస్థలను గుటెరస్ తీవ్రంగా విమర్శించారు.
వివరాలు
ఐరాస ప్రధాన కార్యదర్శి ఏమన్నారు?
"పెద్ద పొగాకు కంపెనీలు అనుసరించిన పద్ధతులనే ఈ సంస్థలు కూడా అనుసరిస్తున్నాయి. శాస్త్రీయ వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి. విధానపరమైన నిర్ణయాలు ఆలస్యం అయ్యేలా చేస్తున్నాయి. అవసరమైన చర్యలను అడ్డుకుంటున్నాయి. భారీ లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ వాటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన క్లైమేట్ ఫండ్ విషయంలో సంపన్న దేశాలు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుటెరస్ కోరారు.
ఈ నిధులు అత్యవసరంగా అవసరమైన ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
"ఈ హామీని అమలు చేసేందుకు గడువును, ఎంత మొత్తంలో నిధులు అందిస్తారనే వివరాలను ఇప్పుడే ఖరారు చేయాలి. ఎందుకంటే ప్రజల జీవితాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి"అని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఒప్పందంపై ప్రధాన దేశాల స్పందన ఏమిటి?
కాప్-31లో ప్రతిపాదించిన ముసాయిదాపై పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్రిటన్ ప్రతినిధి కేట్ హ్యూస్ ఈ ఒప్పందాన్ని చాలా బలహీనమైనదిగా అభివర్ణించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు కలిసికట్టుగా మరింత బలమైన, ప్రతిష్ఠాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
మధ్య అమెరికా దేశమైన పనామా కూడా ముసాయిదాను తిరస్కరించింది. "శాస్త్రం చర్చలతో రాజీపడదు. భూమి మాత్రం మన కోసం వేచి ఉండదు" అని ఆ దేశ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
భారత ప్రతినిధి బృందం మాత్రం ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు, తిరస్కరించలేదు.
చర్చల్లో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు, కొన్ని అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ చైనా ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపింది.
వివరాలు
ఒప్పందంపై ప్రధాన దేశాల స్పందన ఏమిటి?
శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలనే హామీని ఒప్పందంలో చేర్చడాన్ని రష్యా వ్యతిరేకించింది.
ఈ అంశంపై తన ప్రసంగంలో యూరోపియన్ యూనియన్‌ను నేరుగా విమర్శించింది.
ఇక సౌదీ అరేబియా 22 సభ్య దేశాలున్న అరబ్ లీగ్ తరఫున మాట్లాడింది.
చర్చల సమయంలో కొన్ని అంశాలను పక్కన పెట్టినప్పటికీ అరబ్ దేశాలు చిత్తశుద్ధితో చర్చల్లో పాల్గొన్నాయని సౌదీ ప్రతినిధి మొహమ్మద్ అయూబ్ తెలిపారు.
కొత్త ముసాయిదాలో వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసేందుకు ఉపయోగపడే పలు పరిష్కారాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఒప్పందంపై ప్రధాన దేశాల స్పందన ఏమిటి?
2015లో పారిస్ ఒప్పందం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఐక్యరాజ్యసమితి మాజీ వాతావరణ విభాగం అధిపతి క్రిస్టియానా ఫిగ్యురెస్ కూడా ఈ పరిణామంపై స్పందించారు.
ఒప్పందంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు.
అయితే, సదస్సులో నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయినంత మాత్రాన ప్రజలు దీన్ని పూర్తిస్థాయి వైఫల్యంగా భావించకూడదని ఆమె సూచించారు.
వివరాలు
శిలాజ ఇంధనాలు అంటే ఏమిటి? వాటివల్ల నష్టమేంటి?
లక్షల సంవత్సరాల క్రితం భూమిపై జీవించి చనిపోయిన మొక్కలు, జంతువులు తదితర జీవుల అవశేషాలు భూమి పొరల కింద ఒత్తిడి, వేడి ప్రభావంతో మార్పు చెందడం వల్ల శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి.
ఇవి సహజ వనరులే అయినప్పటికీ, పునరుత్పత్తి చేయలేని వనరులుగా పరిగణిస్తారు.
అంటే ఒకసారి వినియోగించిన తర్వాత తక్కువ సమయంలో తిరిగి సహజంగా భర్తీ చేయడం సాధ్యం కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన అవసరాల్లో అధిక భాగం చమురు, బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల ద్వారానే తీరుతోంది.
కార్లు, విమానాలు నడపడానికి, పరిశ్రమల్లో యంత్రాలను పనిచేయించడానికి, ఇళ్లలో గ్యాస్‌తో వంట చేయడానికి, చలిని తట్టుకునేందుకు వేడి ఉత్పత్తి చేయడానికి వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
వివరాలు
శిలాజ ఇంధనాలు అంటే ఏమిటి? వాటివల్ల నష్టమేంటి?
అయితే, ఈ ఇంధనాలను మండించడం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది.
ఈ వాయువు భూమి నుంచి వెలువడే వేడిలో కొంత భాగాన్ని వాతావరణంలోనే బంధిస్తుంది. ఫలితంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ తీవ్రతరం కావడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాలు కూడా పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు ప్రధాన కారణాల్లో శిలాజ ఇంధనాల వినియోగం అత్యంత కీలకమైనది. అందుకే చమురు,బొగ్గు,సహజ వాయువులపై ఆధారపడటాన్ని తగ్గించి,సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అయితే, ఈ మార్పు ఎలా జరగాలి? దానికి అవసరమైన ఆర్థిక వనరులను ఎవరు సమకూర్చాలి? అనే ప్రశ్నలే కాప్-31లో దేశాల మధ్య ప్రధాన విభేదాలకు కారణమయ్యాయి.