Loading...
California: కాలిఫోర్నియా ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు..
కాలిఫోర్నియా ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు..

California: కాలిఫోర్నియా ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రంప్ కాలిఫోర్నియాలో నిర్వహించనున్న నిధుల సేకరణ కార్యక్రమానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా పరంగా దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. పోలీసుల వివరాల ప్రకారం, గోల్ఫ్ క్లబ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ముందుగా సీక్రెట్ సర్వీస్ ఫెడరల్ ఏజెంట్లు గుర్తించారు. వెంటనే లాస్ ఏంజెలిస్ కౌంటీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

అరెస్టైన వ్యక్తిని డౌనీ ప్రాంతానికి చెందిన జెనైన్ జాన్ టీల్ గా గుర్తింపు 

అరెస్టైన వ్యక్తిని జెనైన్ జాన్ టీల్ (38)గా గుర్తించారు. అతడు డౌనీ ప్రాంతానికి చెందినవాడని అధికారులు తెలిపారు.

అతడి ప్యాంటు జేబుల్లో లోడ్ చేసిన తుపాకీతో పాటు తూటాలు నింపిన మేగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం గోల్ఫ్ క్లబ్ పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన అతడి కారును తనిఖీ చేయగా, అందులో మరిన్ని తూటాలు లభ్యమయ్యాయి.

దర్యాప్తులో నిందితుడిపై గతంలో దోపిడీ కేసు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అనుమతి లేకుండా రహస్యంగా ఆయుధాలు వెంట తీసుకువచ్చాడనే అనుమానంతో అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

వివరాలు 

నిందితుడి నివాసంలో పోలీసుల సోదాలు

ఆదివారం అరెస్టు అనంతరం, సోమవారం డౌనీలోని నిందితుడి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

అక్కడ నిషేధిత మార్పులు చేసిన ఏఆర్-ప్లాట్‌ఫామ్ పిస్టల్, .45 క్యాలిబర్ పిస్టల్, రెండు రేడియో కమ్యూనికేషన్ పరికరాలు, అలాగే పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న పుస్తకాలలోని విషయాలు కొంత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

అయితే, ప్రస్తుతం నిందితుడి వల్ల స్థానిక ప్రజలకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT