Cyberattacks: అణుస్థావరాలే లక్ష్యంగా భారీగా సైబర్ దాడులు.. ఇరాన్ ప్రభుత్వ సేవలకు అంతరాయం
పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో శనివారం చోటుచేసుకున్న భారీ సైబర్ దాడులు మరో కీలక విషయాన్ని తెరపైకి తెచ్చాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ ప్రభుత్వంలోని మూడు ప్రధాన శాఖలు న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ అణుస్థావరాలు ఈ దాడుల లక్ష్యంగా మారడం గమనార్హం. ఫలితంగా కీలకమైన సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేసినట్లు, ఇరాన్ సైబర్‌స్పేస్ విభాగంలో పనిచేసిన మాజీ సెక్రటరీ ఇరాన్ మీడియాతో చెప్పారు. తమ అణుస్థావరాలు సైబర్ దాడులకు గురయ్యాయని, ఇంధన సరఫరా నెట్‌వర్క్‌లు, మున్సిపల్ సేవలు, ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్క్‌లు కూడా దాడులకు గురయ్యాయని ఆయన అన్నారు.
హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో, ఇరాన్ సైతం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల ప్రభావం ఇజ్రాయెల్‌పై తీవ్రమవుతుండగా, నెతన్యాహు ప్రభుత్వం ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో ఉన్నట్లు ప్రకటించింది. ఇక ఈ పరిస్థితిలో ఇరాన్ అణు, చమురు స్థావరాలు ఇజ్రాయెల్ దాడులకు గురవుతాయా అనే ఆందోళన మధ్య, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నెతన్యాహుకు సూచించారు. ఈ నేపథ్యంలో సైబర్ దాడులు జరగడం గట్టి చర్చకు దారితీసింది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆ దేశ పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే.