LOADING...
Trilateral Meet: 22న మూడు దేశాధినేతల భేటీ.. యుద్ధం ముగింపుపై కీలక నిర్ణయం? 
22న మూడు దేశాధినేతల భేటీ.. యుద్ధం ముగింపుపై కీలక నిర్ణయం?

Trilateral Meet: 22న మూడు దేశాధినేతల భేటీ.. యుద్ధం ముగింపుపై కీలక నిర్ణయం? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు మార్గం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) మధ్య అలాస్కాలో జరిగిన భేటీకి కొనసాగింపుగా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరువురి మధ్య చర్చల అనంతరం, ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ (Zelensky)తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం (Trilateral Meet)పై చర్చ జరగగా, ఆగస్టు 22న ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ట్రంప్‌ యోచిస్తున్నారని అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి. పుతిన్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ యూరోపియన్‌ నాయకులకు కూడా ఈ ప్రతిపాదనను వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో జెలెన్‌స్కీ సోమవారం ట్రంప్‌ను ప్రత్యక్షంగా కలవనున్నారు.

Details

యూరోపియన్ దేశాల నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం

ఈ కీలక సమావేశానికి యూరోపియన్‌ దేశాల నాయకులను కూడా ట్రంప్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ వ్యాఖ్యానిస్తూ - సోమవారం జరగనున్న ట్రంప్‌, జెలెన్‌స్కీ సమావేశం అనంతరం త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యుద్ధం ముగింపు దిశగా ఆ రోజు ఒక కీలక ప్రకటన వెలువడవచ్చని సూచించారు. ఇటీవల అలాస్కా వేదికగా ట్రంప్‌, పుతిన్‌లు రెండున్నర గంటలకు పైగా చర్చించినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే చర్చలు సానుకూలంగా సాగాయని ఇరువురు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ - "ఒప్పందంపై తుది నిర్ణయం జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.

Details

కీలక ఆంశాలపై చర్చ

అనంతరం ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన జెలెన్‌స్కీ, త్రైపాక్షిక సమావేశం ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ - కీలక అంశాలపై చర్చించేందుకు ఇది ఒక మంచి వేదిక అవుతుంది. పరిస్థితులను చక్కదిద్దే శక్తి అమెరికాకు ఉంది" అని అభిప్రాయపడ్డారు. అలాగే శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న యూరోపియన్‌ నాయకులకు కృతజ్ఞతలని తెలిపారు. ఇక జెలెన్‌స్కీ-ట్రంప్‌ భేటీ వాషింగ్టన్‌ డీసీలో సోమవారం జరగనున్న నేపథ్యంలో యూరోపియన్‌ నేతలు అప్రమత్తమయ్యారు.

Details

సజావుగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు

గతంలో అమెరికా అధ్యక్షుడితో జరిగిన ఒక సమావేశంలో జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైన విషయం గుర్తుచేసుకుంటూ, ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ట్రంప్‌తో స్నేహపూర్వక సంబంధాలు కలిగిన ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ సహా మరికొంతమందిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి మద్దతుగా వాషింగ్టన్‌కు పంపాలని యూరోపియన్‌ దౌత్యవేత్తలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య చర్చలు సజావుగా సాగేలా వీరు జాగ్రత్తలు తీసుకోనున్నారని సమాచారం.