Megaspeed: అలిస్ హువాంగ్ 2025లోనే కంపెనీని వీడారు.. మెగాస్పీడ్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తమ వ్యాపార కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ, అంతర్జాతీయ కార్యకలాపాలపై మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు సింగపూర్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్ వెల్లడించింది. ఈ విచారణలో భాగంగా బయటి న్యాయ నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఎన్‌విడియా సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనా తరఫున గూఢచర్యం చేస్తున్నారనే అనుమానాలు ఎదుర్కొంటున్న అలిస్.. మెగాస్పీడ్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ జెన్సన్ హువాంగ్‌కు దగ్గరయ్యారని అమెరికా ఆరోపిస్తోంది. ఆమె ద్వారా చైనాకు చెందిన కంపెనీలకు సుమారు 7.5 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఎన్‌విడియా చిప్‌లు చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
చట్టబద్ధంగా, న్యాయబద్ధంగానే వ్యాపారం
ఈ నేపథ్యంలోనే మెగాస్పీడ్ సంస్థ తన కార్యకలాపాలపై వస్తున్న కథనాలపై విచారణకు సిద్ధమైంది.
తమ వ్యాపార కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ, ప్రపంచవ్యాప్త కార్యకలాపాలపై ఇటీవల మీడియాలో వచ్చిన ఆరోపణలకు మద్దతుగా ధ్రువీకరించగల ఆధారాలు లేవని మెగాస్పీడ్ స్పష్టం చేసింది.
తాము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
తాము కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతి దేశంలోని స్థానిక చట్టాలు, నియంత్రణ నిబంధనలను పాటిస్తున్నామని వివరించింది.
అంతేకాకుండా అమెరికా ఎగుమతి నియంత్రణ నిబంధనలకు అనుగుణంగానే అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
అలిస్‌తో తమ సంస్థకు ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని మెగాస్పీడ్ స్పష్టం చేసింది. 2025 ఆగస్టు 30నే ఆమె కంపెనీని వీడినట్లు వెల్లడించింది.
అయితే అలిస్ వ్యక్తిగత వ్యవహారాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది.
వివరాలు
భారీ వృద్ధిపై కంపెనీ మౌనం
మెగాస్పీడ్ ఆర్థిక లావాదేవీలు,ఆస్తుల పెరుగుదలపై కూడా పలు వార్తాసంస్థలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.
సింగపూర్ కంపెనీల రికార్డుల ప్రకారం.. 2023లో మెగాస్పీడ్‌కు ఎలాంటి ఆదాయం లేదు.
అయితే 2024లో ఏకంగా 294మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు వార్తాకథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు 2023 చివరి నుంచి 2024మధ్య కాలంలో సంస్థ మొత్తం ఆస్తులు దాదాపు 90రెట్లు పెరిగాయి.
దీంతో వాటి విలువ సుమారు 3బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరినట్లు సమాచారం.
ఇంత తక్కువ వ్యవధిలో కంపెనీ ఇంత భారీగా వృద్ధి చెందడానికి జెన్సన్ హువాంగ్‌తో అలిస్‌కు ఉన్న అనైతిక సంబంధాలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే కంపెనీ ఆదాయం,ఆస్తుల భారీ పెరుగుదలకు సంబంధించిన ఈ ఆరోపణలపై మెగాస్పీడ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.