Page Loader
Mark Zuckerberg: ట్రంప్‌ రహస్య మిలిటరీ సమావేశంలో అనుకోని అతిథి..! బయటకు పంపిన సిబ్బంది..!
ట్రంప్‌ రహస్య మిలిటరీ సమావేశంలో అనుకోని అతిథి..! బయటకు పంపిన సిబ్బంది..!

Mark Zuckerberg: ట్రంప్‌ రహస్య మిలిటరీ సమావేశంలో అనుకోని అతిథి..! బయటకు పంపిన సిబ్బంది..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షతన జరిగిన ఒక అత్యంత రహస్య మిలిటరీ సమావేశంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలో మెటా సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ అకస్మాత్తుగా ఓవల్‌ ఆఫీసులోకి ప్రవేశించడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా బయటకు పంపించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సంఘటన ఈ ఏడాది ప్రారంభంలో జరిగినప్పటికీ, ఇప్పుడే ప్రజల్లోకి బయటికొచ్చింది. అమెరికా ఆరో తరం స్టెల్త్‌ యుద్ధ విమానాలు అయిన ఎఫ్-47 ఫైటర్‌ జెట్లపై ట్రంప్‌ కొన్ని నెలల క్రితం ఓ రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఓవల్‌ ఆఫీసులో చోటుచేసుకోగా, దేశపు అత్యున్నత స్థాయి మిలిటరీ అధికారులూ ఇందులో పాల్గొన్నారు.

వివరాలు 

ఈ వ్యవహారంపై మిలిటరీ వర్గాలు అసహనం

వారు ఈ యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలపై ట్రంప్‌కు వివరాలు అందిస్తున్న సమయంలో, అనుకోకుండా జుకర్‌బర్గ్‌ ఆ గదిలోకి ప్రవేశించారు. ఇది చూసిన సైనికాధికారులు కంగుతిన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్‌ లేకుండా జుకర్‌బర్గ్‌ ఆ భేటీలో ప్రవేశించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా గది వెలుపలికి వెళ్లమని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. అప్పటికే ట్రంప్‌ను పలకరించిన జుకర్‌బర్గ్‌ అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై మిలిటరీ వర్గాలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీన్ని వారు ఒక భద్రతా లోపంగా పరిగణించినట్లు పేర్కొనబడింది.

వివరాలు 

జుకర్‌బర్గ్‌ను గది వెలుపలికి పంపించారన్న వార్తల్లో నిజం లేదు 

అయితే, ఈ విషయంపై వైట్‌హౌస్‌కు చెందిన ఒక సీనియర్‌ అధికారి స్పందిస్తూ.. జుకర్‌బర్గ్‌ను గది వెలుపలికి పంపించారన్న వార్తల్లో నిజం లేదన్నారు. ''అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా కోరిన కారణంగానే జుకర్‌బర్గ్‌ ఆ గదిలోకి వచ్చి ఆయనకు హాయ్‌ చెప్పారు. అనంతరం, తన భేటీ సమయం వచ్చేంతవరకూ గది బయటే ఉండి వేచిచూశారు. మిలిటరీ సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు'' అని ఆయన వివరించారు.

వివరాలు 

ఘర్షణాత్మకంగా ట్రంప్‌-జుకర్‌బర్గ్‌ మధ్య సంబంధాలు 

గమనించదగిన విషయమేమంటే.. 2021లో అమెరికా క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి అనంతరం ట్రంప్‌ సోషల్‌మీడియా ఖాతాలను..ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్.. మెటా సంస్థ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్‌-జుకర్‌బర్గ్‌ మధ్య సంబంధాలు ఘర్షణాత్మకంగా మారాయి. కానీ 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య స్నేహబంధం తిరిగి నెలకొంది. ట్రంప్‌ ప్రతిపాదించిన 'మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌' (MAGA) అజెండాకు మద్దతుగా జుకర్‌బర్గ్‌ 1 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. అంతేకాదు, ట్రంప్‌ ప్రమాణ స్వీకార వేడుకలోనూ ఆయన పాల్గొన్నారు.