Page Loader
US army: అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం?
అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం?

US army: అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఆర్మీ సైనికుల కోసం సేకరించిన ఆహార నిధుల్లో అధిక భాగాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నట్లు మిలిటరీ డాట్‌ కామ్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. సైనికుల వేతనాల నుంచి ప్రతి నెలా 460 డాలర్లు కట్‌ చేసి, ఆహారం కోసం మొత్తం 225 మిలియన్‌ డాలర్లు సేకరించినప్పటికీ, అందులో కేవలం 74 మిలియన్‌ డాలర్లు మాత్రమే భోజనానికి వినియోగించారని పేర్కొంది. మిగతా 151 మిలియన్‌ డాలర్లను ఇతర ప్రాజెక్టులకు మళ్లించినట్లు నివేదికలు వెల్లడించాయి. 2024లో అమెరికా ఆర్మీ పలు స్థావరాల్లో సైనికుల నుంచి సేకరించిన మొత్తం నగదు మరింత ఎక్కువగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Details

87శాతం నిధులు మళ్లింపు

జార్జియాలోని ఫోర్ట్ స్టీవర్ట్‌లో మాత్రమే 17 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తే, అందులో కేవలం 2.1 మిలియన్‌ డాలర్లను మాత్రమే భోజనానికి వినియోగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఫుడ్‌ కోసం కేటాయించిన నిధుల్లో దాదాపు 87% ఇతర ప్రాజెక్టులకు మళ్లించినట్లు వెల్లడైంది. ఈ పరిస్థితిని తీవ్రంగా తప్పుబడుతూ, ప్రతినిధుల సభ సభ్యుడు జుల్ టోకుడా, 'సైనికుల ఆహార నిధులను దొంగలించుతూ, సైనిక సంసిద్ధతను కాపాడడం అసంభవం' అని వ్యాఖ్యానించారు. సైనికులకు తగినంత ఆహారం అందించలేకపోవడం ఆగ్రహించదగిన విషయమని పేర్కొన్నారు. సైనికులు తినే భోజనం నాణ్యతలోనూ తీవ్రమైన లోపాలు ఉన్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయి. సరిగా ఉడకని మాంసం, నాసిరకం కూరగాయలతో భోజనం వడ్డిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.