LOADING...
PM Modi: మోదీ-జిన్‌పింగ్ భేటీతో భారత్-చైనా బంధానికి కొత్త ఊపిరి
మోదీ-జిన్‌పింగ్ భేటీతో భారత్-చైనా బంధానికి కొత్త ఊపిరి

PM Modi: మోదీ-జిన్‌పింగ్ భేటీతో భారత్-చైనా బంధానికి కొత్త ఊపిరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi)చైనా(China)పర్యటన చేపట్టారు. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్బంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Xi Jinping)తో భేటీ అయ్యారు. అమెరికా విధించిన సుంకాల భారం నేపథ్యంలో ఈ సమావేశం అంతర్జాతీయ స్థాయిలో కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌-చైనా మధ్య సానుకూల సంబంధాలను కొనసాగించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతేడాది రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో జిన్‌పింగ్‌తో తన సమావేశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మార్గం సుగమం చేసిందని మోదీ పేర్కొన్నారు.

Details

కైలాశ్‌ మానససరోవర్‌ యాత్ర మళ్లీ ప్రారంభం

ప్రస్తుతం భారత్‌-చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొన్నదని ఆయన వివరించారు. అలాగే కైలాశ్‌ మానససరోవర్‌ యాత్ర మళ్లీ ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించబడనున్నాయని తెలిపారు. దాదాపు 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు ఇరుదేశాల సహకారంపై ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసం, గౌరవంతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పించామనే విషయాన్ని మోదీ స్పష్టంచేశారు. అలాగే చైనాలో పర్యటించేందుకు, SCO సదస్సుకు ఆహ్వానించినందుకు ఆయన జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Details

 2019లో జిన్‌పింగ్‌ భారత్‌ లో పర్యటన

ప్రధాని మోదీ చివరిసారిగా చైనాను 2018లో సందర్శించారు. అనంతరం 2019లో జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటించారు. కానీ 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత-చైనా సైనిక ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఇరుదేశాల దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి వీటిని పునరుద్ధరించే దిశగా ఇరువైపులా సైనిక, దౌత్యాధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల భారం మోపడం తెలిసిందే. ఇప్పటికే ఆ సుంకాలను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో భారత్‌కు తాము అండగా ఉంటామని డ్రాగన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్ భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.