PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన శనివారం ప్రారంభమవుతుంది. ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు సంబంధించిన సహకారాన్ని మెరుగుపరచడం, ఉక్రెయిన్, గాజా వివాదాల పరిష్కారాలు కనుగొనడం, అలాగే గ్లోబల్ సౌత్ సమస్యలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. విల్మింగ్టన్, డెలావేర్‌లో జరిగే వార్షిక క్వాడ్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. అలాగే, న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన ప్రసంగిస్తారు. టెక్నాలజీ రంగంలో ఉన్న ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తారు. దీంతో పాటు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మరికొన్ని దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
క్వాడ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు
మోదీ మొదట విల్మింగ్టన్ చేరుకుని, సెప్టెంబర్ 21న క్వాడ్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో పాల్గొంటారు. క్వాడ్ సమ్మిట్‌లో గాజా, ఉక్రెయిన్ వివాదాలు, అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతపై చర్చ జరుగుతుంది. మోదీ మూడు క్వాడ్ దేశాల నాయకులతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకారం, క్వాడ్ సమ్మిట్‌లో అనేక కొత్త కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉంది. రోగులు,వారి కుటుంబాలను క్యాన్సర్ ప్రభావం నుంచి రక్షించే కొత్త ప్రణాళికను క్వాడ్ నేతలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నారు.
శాంతి, ప్రగతి, సుస్థిరతపై క్వాడ్ సమ్మిట్ ప్రత్యేక దృష్టి
శాంతి, ప్రగతి, సుస్థిరతపై క్వాడ్ సమ్మిట్ ప్రత్యేక దృష్టి సారించనుంది. నేతలు ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, మానవతా సహాయంపై చర్చిస్తారని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ వివాద పరిష్కారంలో భారత్ పాత్రపై మిస్రీ మాట్లాడుతూ, ఈ అంశంపై భారత ప్రభుత్వం అనేక భాగస్వాములు, నాయకులతో చర్చలు జరుపుతుందని చెప్పారు.