
Morocco: మొరాకోలో జెన్ Z నిరసనలు.. ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మొరాకోలో జెన్ Z యువత చేపట్టిన నిరసనల్లో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, వందలమంది గాయపడ్డారు. "GenZ212" లేదా "Gen Z Uprising" పేరిట జరుగుతున్న ఈ ఉద్యమం, నేపాల్-బంగ్లాదేశ్ యువజన ఆందోళనల మాదిరిగా, దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. 2011లో అరబ్ స్ప్రింగ్ సమయంలో ప్రారంభమైన "ఫిబ్రవరి 20 ఉద్యమం" తరువాత, మొరాకోలో ఇంత పెద్దస్థాయిలో ప్రజా వ్యతిరేకత జరగడం ఇదే. టెక్నాలజీ ఆధారంగా ముందుకు వచ్చిన యువత సెప్టెంబర్ 27 నుండి రబాట్,కాసాబ్లాంకా,మరాకెష్,అగదీర్,టాంగియర్ సహా కనీసం 15 పట్టణాల్లో నిరసనలు మొదలయ్యాయి. 1990 మధ్యకాలం నుంచి 2010ప్రారంభం మధ్యలో జన్మించిన యువతే ఈ ఉద్యమానికి ఆధారంగా ఉన్నారు. నిరుద్యోగం 35.8% వరకు పెరగడం,ప్రాంతీయ అసమానతలు,పాడైపోతున్న ప్రభుత్వ సేవలు, అవినీతి..ఇవన్నీ యువతలో అసంతృప్తిని రగల్చాయి.
వివరాలు
ఆసుపత్రిలో గర్భిణుల మృతితో ఆగ్రహం
ఈ నిరసనకు నిజమైన చిచ్చు అగదీర్‌లో జరిగింది. ఒక పబ్లిక్ హాస్పిటల్‌లో వైద్యులు, సిబ్బంది కొరతతోపాటు పరికరాల లేమి కారణంగా ఒకేసారి 8 మంది గర్భిణులు మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య రంగం లోపాలను బయటపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 10,000 మందికి కనీసం 25 మంది వైద్యులు ఉండాలి. మొరాకోలో ఇది కేవలం 7.7 మంది మాత్రమే, అగదీర్‌లో అయితే 4.4 వరకు పడిపోయింది. దీంతో వైద్య వసతులపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.
వివరాలు
ఫుట్‌బాల్ స్టేడియాలు vs ఆసుపత్రులు
2025 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్, 2030 FIFA వరల్డ్‌కప్ కోసం ప్రభుత్వం బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "మాకు కావాల్సింది ఆస్పత్రులు.. స్టేడియాలు కాదు" అని నినాదాలు వినిపించాయి. భూకంప ప్రభావం నుంచి బయటపడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా పునరుద్ధరణ జరగకపోవడం యువత కోపాన్ని మరింత పెంచింది.
వివరాలు
జెన్ Z 212, మొరాకో యువత స్వరం
ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రెండు డిజిటల్ కలెక్టివ్‌లు GenZ 212 (రబాట్ ఏరియా కోడ్ పేరు మీద ఏర్పడింది) Morocco Youth Voice. వీళ్లు TikTok, Instagram, Discord, Facebook వంటి సోషల్ మీడియాలో ప్రజలను ర్యాలీలకు సమీకరిస్తున్నారు. రాజకీయ పార్టీలను పక్కన పెట్టి, decentralized leaderless ఉద్యమంగా ముందుకు వస్తున్నారు. మహిళల సమస్యలు, మానవ హక్కులు ముఖ్యాంశాలుగా పెట్టుకున్నారు. AI కంటెంట్, లైవ్ స్ట్రీమ్స్ వంటివి వాడుతూ ఈ ఉద్యమం వేగంగా పెరుగుతోంది. మునుపటి ఉద్యమాల కంటే భిన్నం ఇంతకు ముందు మొరాకోలో జరిగిన నిరసనలను యూనియన్లు,ఎడమపక్ష పార్టీలు నడిపేవి. కానీ ఈసారి డిజిటల్‌లో పుట్టి సోషల్ మీడియా శక్తితో ముందుకు వస్తున్న"జెన్ Z"యువతే కేంద్రమైంది.
వివరాలు
హింసకు దారితీసిన నిరసనలు
వీళ్ల డిమాండ్లు.. ఆరోగ్య సంస్కరణలు, విద్యలో పెట్టుబడులు, అవినీతిపై కఠిన చర్యలు, వరల్డ్‌కప్ నిధులను ప్రజావసరాలకు మళ్లించడం. సెప్టెంబర్ చివరి నుంచి శాంతియుతంగా సాగిన నిరసనలు అక్టోబర్ 1న హింసాత్మకంగా మారాయి. ఇనేజ్‌గేన్, ఉజ్డా ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగగా, లెక్లియా (అగదీర్ దగ్గర)లో ఇద్దరు, ఉజ్డాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు 263 భద్రతా సిబ్బంది, 23 పౌరులు గాయపడ్డారు. 400 మందిని అరెస్ట్ చేశారు, అందులో మైనర్లు కూడా ఉన్నారు. అక్టోబర్ 7 నుండి విచారణలు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
ప్రభుత్వ వైఖరి
ప్రభుత్వం భద్రతా దళాల చర్యలను "సమతుల్యమైనవి" అని సమర్థించుకుంటోంది. అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం అధిక బలప్రయోగం జరిగిందని, మాటల స్వేచ్ఛను అణచివేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. 2026లో జరగబోయే ఎన్నికల దృష్ట్యా, ఈ నిరసనలు మొరాకో రాజకీయాల్లో తరం మార్పుకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు.