Maldives: మాల్దీవులలో భారత సైన్యం.. ముయిజు వాదనలను తప్పుబట్టిన మాజీ మంత్రి
మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ వేల మంది భారతీయ సైనిక సిబ్బంది ఉన్నారంటూ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. తమ దేశంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరని అన్నారు.100రోజుల ముయిజ్జూ పాలనలో అనేక అబద్దాలు ప్రచారం చేశారని..అందులో ఇదొకటని విరచుకుపడ్డారు. "వేలాది మంది భారతీయ సైనిక సిబ్బంది దేశంలోకి ప్రవేశించారని అధ్యక్షుడు ముయిజ్జు ప్రచార చేశారు.ఇదే నినాదంతో అయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారు.ఇండియాతో అటువంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారు.ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మయిజ్జు పదే పదే అబద్ధాలు చెబుతున్నారు.దేశంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరు."అని MDP కి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు Xలో పోస్ట్ చేశారు.
మాల్దీవులలో దాదాపు 70 మంది భారత సైనికులు
పారదర్శకత ముఖ్యమని, సత్యమే గెలవాలని ఆయన నొక్కి చెప్పారు. ముయిజ్జు పార్టీ మాల్దీవుల నుండి భారత దళాల తొలగింపుపై ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించింది. ప్రస్తుతం, మాల్దీవులలో డోర్నియర్ 228 సముద్ర గస్తీ విమానం,రెండు HAL ధృవ్ హెలికాప్టర్లతో పాటు దాదాపు 70 మంది భారత సైనికులు ఉన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజున, ముయిజ్జు అధికారికంగా మాల్దీవుల నుండి తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గత డిసెంబర్‌లో, భారత ప్రభుత్వంతో చర్చల అనంతరం, భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకునేందుకు ఒక ఒప్పందం కుదిరిందని ముయిజు పేర్కొన్నారు.
భారత బలగాల ఉపసంహరణకు..దౌత్యపరమైన చర్చలు
భారత బలగాల ఉపసంహరణకు సంబంధించి దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. గత చర్చలలో అంగీకరించినట్లుగా, మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదానిలోని సైనిక సిబ్బందిని మార్చి 10, 2024 లోపు ఉపసంహరించుకుంటారని, మిగిలిన రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని సైనిక సిబ్బందిని మే 10, 2024 లోపు ఉపసంహరించుకుంటారని ఆయన వివరించారు. ఈ నెల ప్రారంభంలో, మాల్దీవులలోని విమానయాన ప్లాట్‌ఫారమ్‌లలోని సైనిక సిబ్బందిని భారతదేశం సమర్థులైన భారతీయ సాంకేతిక సిబ్బందితో భర్తీ చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.