Australia: మస్క్ vs ఆస్ట్రేలియా ప్రభుత్వం.. సోషల్ మీడియా నిషేధంపై వివాదం
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమాలపై వయో పరిమితి విధించడం, ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ యాక్సెస్‌ను నియంత్రించడానికి ఒక 'బ్యాక్ డోర్'లా ఉందని ఎలాన్ మస్క్ విమర్శించారు. ఆయన ఈ నిషేధాన్ని వ్యక్తిగత స్వేచ్ఛలను హరించే చర్యగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ మస్క్ వ్యాఖ్యలను ఖండించారు. ఎలాన్ మస్క్‌కు తమ స్వంత అజెండా ఉందని, ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్) యజమాని కాబట్టి, ఆ ప్లాట్‌ఫాం ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
102 ఓట్లతో బిల్లు ఆమోదం
ఈ వివాదంపై ఏ వ్యక్తితోనైనా తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆల్బనీస్ స్పష్టం చేశారు. గత బుధవారం ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో 102 ఓట్లతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇది చట్టరూపం దాల్చేందుకు సెనెట్ ఆమోదం అవసరం. నిషేధాన్ని అమలుచేయడం కోసం ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఒక ఏడాది గడువు ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో, 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.273 కోట్లు) వరకు భారీ జరిమానా విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ నిషేధంపై వ్యతిరేకతతో పాటు మద్దతు కూడా లభిస్తోంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని మస్క్ వ్యాఖ్యానించారు.