Loading...
UN court: రోహింగ్యాలపై జాతి నిర్మూలనకు పాల్పడింది.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన ఐసీజే
రోహింగ్యాలపై జాతి నిర్మూలనకు పాల్పడింది.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన ఐసీజే

UN court: రోహింగ్యాలపై జాతి నిర్మూలనకు పాల్పడింది.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన ఐసీజే

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెదర్లాండ్స్‌లోని హేగ్‌ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లిం మైనారిటీలపై ఆ దేశం పాల్పడిన దాడులు జాతి నిర్మూలన (జెనోసైడ్‌) కిందకే వస్తాయని స్పష్టం చేసింది. హింస కారణంగా దేశం విడిచి వెళ్లిన శరణార్థులు సురక్షితంగా, స్వచ్ఛందంగా,గౌరవప్రదంగా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మయన్మార్‌ను ఆదేశించింది. బాధితులకు పరిహారం చెల్లించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన అత్యున్నత న్యాయస్థానమైన ఐసీజే తన 80 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక దేశం జాతి నిర్మూలనకు పాల్పడినట్లు నిర్ధారించడం ఇదే మొదటిసారి. 2017లో రోహింగ్యాలపై మయన్మార్‌ సైన్యం జరిపిన దాడుల్లో బాధితులైన వేలాది మందికి ఈ తీర్పు న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నారు.

వివరాలు 

రోహింగ్యాలపై సైన్యం దారుణాలు.. వేలాది మంది బలి

హేగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ జస్టిస్‌లో ఐసీజే అధ్యక్షుడు యుజి ఇవాసావా తీర్పును చదివి వినిపించారు.

ఉత్తర రఖైన్‌ రాష్ట్రంలోని రోహింగ్యా ప్రజలపై మయన్మార్‌ జాతి నిర్మూలనకు పాల్పడిందని ఆయన స్పష్టం చేశారు.

దాదాపు మూడు గంటలపాటు సాగిన తీర్పులో మయన్మార్‌ సైన్యం సాగించిన దారుణాలను న్యాయస్థానం వివరించింది.

ఆ దేశంలోని ముస్లిం మైనారిటీ వర్గమైన రోహింగ్యాలపై జరిగిన దాడుల్లో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

మహిళలపై పెద్ద ఎత్తున లైంగిక దాడులు జరిగాయని, చిన్నారులపైనా అత్యంత క్రూరంగా వ్యవహరించారని ఐసీజే అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఈ హింస కారణంగా లక్షలాది మంది రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు వలస వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.

వివరాలు 

రోహింగ్యాల పునరావాసానికి ఆదేశాలు.. బాధ్యులకు శిక్షలు

రోహింగ్యాలు నివసించే గ్రామాలను పద్ధతి ప్రకారం ధ్వంసం చేశారని, ఆ ప్రాంతాల్లో రోహింగ్యేతరులను తీసుకొచ్చి నివాసాలు ఏర్పాటు చేశారని న్యాయస్థానం పేర్కొంది.

ప్రజలను పూర్తిగా అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోందని తెలిపింది.

ఒక వర్గాన్ని పూర్తిగా లేదా కొంతవరకు నిర్మూలించాలనే ఉద్దేశం ఉందా లేదా అన్నదే జాతి నిర్మూలనను నిర్ధారించడంలో కీలకమైన అంశమని కోర్టు అభిప్రాయపడింది.

హింస కారణంగా మయన్మార్‌ను విడిచి వెళ్లిన వారిని ఎలాంటి బలవంతం లేకుండా, సురక్షితంగా, గౌరవప్రదంగా వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని ఐసీజే ఆదేశించింది.

జాతి నిర్మూలనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని కూడా స్పష్టం చేసింది.

బాధితులకు చెల్లించాల్సిన పరిహారం ఎంతన్నది భవిష్యత్తులో నిర్ణయించనుంది.

ADVERTISEMENT

వివరాలు 

మిన్‌ ఆంగ్‌ హ్లైంగ్‌పై పెరగనున్న అంతర్జాతీయ ఒత్తిడి

ఐసీజే ఇచ్చే తీర్పులు చట్టబద్ధంగా అమలు చేయాల్సినవే. వాటిపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా లేదు.

అయితే, తీర్పులను అమలు చేయించే ప్రత్యేక వ్యవస్థ ఈ న్యాయస్థానానికి లేదు.

దీంతో మయన్మార్‌ పాలకులు ఈ ఆదేశాలను ఎంతవరకు పాటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అయినప్పటికీ ఈ తీర్పుతో మయన్మార్‌ నాయకుడు మిన్‌ ఆంగ్‌ హ్లైంగ్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

2017లో రోహింగ్యాలపై సైనిక చర్యలు జరిగిన సమయంలో మిన్‌ ఆంగ్‌ హ్లైంగ్‌ సైన్యానికి నాయకత్వం వహించారు.

ఆ తర్వాత 2021లో ఆంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని సైనిక తిరుగుబాటు ద్వారా కూలదోశారు.

ఈ ఏడాది పరిమితులతో కూడిన ఎన్నికల అనంతరం ఆయన పౌర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ADVERTISEMENT

వివరాలు 

గాజా కేసుపైనా ప్రభావం చూపనున్న ఐసీజే తీర్పు

అంతర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు తాజా తీర్పు ఇబ్బందులు కలిగించే అవకాశముంది.

గాజాలో ఇజ్రాయెల్‌ జాతి నిర్మూలనకు పాల్పడిందా లేదా అనే అంశంపై ఐసీజే మరో కీలక కేసును విచారిస్తోంది.

ఈ నేపథ్యంలో మయన్మార్‌ కేసులో వెలువడిన తీర్పును అంతర్జాతీయ న్యాయ నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు.

గాజా కేసులో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వివరాలు 

న్యాయం జరుగుతుందన్న ఆశ..

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరంలో 10 లక్షల మందికి పైగా రోహింగ్యాలు నివసిస్తున్నారు.

తాజా తీర్పుతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ వారిలో చిగురించింది.

తీర్పు వెలువడకముందు 23 ఏళ్ల ఓ రోహింగ్యా మహిళ తన ఆవేదనను వెల్లడించింది.

మయన్మార్‌ సైన్యం చేతిలో అత్యాచారానికి గురైన ఆమె.. తనకు న్యాయం కావాలని కోరింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ అంశంపై ఐసీజే ప్రత్యేకంగా స్పందించాలని విజ్ఞప్తి చేసింది.

తన పేరు వెల్లడించేందుకు ఆమె నిరాకరించింది. హింస నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు తమ వెంట ఎన్నో భయానక అనుభవాలను తీసుకొచ్చారు.

సామూహిక అత్యాచారాలు,సామూహిక హత్యలు, కుటుంబ సభ్యులు, చిన్నారులపై జరిగిన దాడుల గురించి వారు వివరించారు.

వివరాలు 

గాంబియా పిటిషన్‌తో విచారణ..

మరోవైపు, ఈ కేసుపై 15 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం ఏడేళ్లుగా విచారణ జరిపింది.

1948లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన జాతి నిర్మూలన నిరోధక ఒప్పందం ఆధారంగా గాంబియా ఈ కేసును ఐసీజే ముందుకు తీసుకొచ్చింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రూపొందించిన ఈ ఒప్పందం ప్రకారం.. మరో దేశం జాతి నిర్మూలనకు పాల్పడిందని అనుమానిస్తే ఏ దేశమైనా దానిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయవచ్చు.

అయితే, మయన్మార్‌ మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తోంది.

తమ సైనిక చర్యలు జాతి నిర్మూలన కోసం కాదని, సాయుధ తిరుగుబాటుదారుల దాడులను అడ్డుకునేందుకేనని వాదించింది.

తిరుగుబాటుదారుల దాడుల్లో తమ భద్రతా సిబ్బందిలో 12 మంది మరణించారని పేర్కొంది.

వివరాలు 

గాంబియా పిటిషన్‌తో విచారణ..

జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా మయన్మార్‌ ప్రతినిధి కో కో హ్లైంగ్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరిగేందుకు తమ దేశం చూస్తూ ఊరుకోలేదని న్యాయమూర్తులకు తెలిపారు.

మరోవైపు, మయన్మార్‌లో ఎన్నో ఏళ్లుగా వివక్ష, వేధింపులకు గురవుతున్న బలహీన వర్గంపై అత్యంత క్రూరమైన హింస జరిగినట్లు విశ్వసనీయ నివేదికలను పరిశీలించిన తర్వాతే తాము కేసు వేసినట్లు గాంబియా న్యాయశాఖ మంత్రి డౌడా జాలో తెలిపారు.

57 సభ్య దేశాలున్న ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) కూడా తమకు పూర్తి మద్దతు ఇస్తోందని చెప్పారు.

ఇది అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, నిజమైన మనుషులు, వారి బాధలు, జీవితాలకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

గాంబియా పిటిషన్‌తో విచారణ..

తీర్పుతో తమకు న్యాయం జరుగుతుందని మరో బాధితుడు మహమ్మద్‌ ఉస్మాన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మయన్మార్‌ సైన్యం చేతిలో తల్లిదండ్రులు, తమ్ముడిని కోల్పోయిన అతడు.. స్వగ్రామానికి తిరిగి వెళ్లి వారి అంత్యక్రియలకు సంబంధించిన చివరి సంప్రదాయాలు నిర్వహించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

తన తండ్రిని సైనికులు కాల్చి చంపారని, తల్లిని మరికొందరు మహిళలతో కలిసి ఓ ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారని, అనంతరం తమ ఇంటిని తగలబెట్టారని 20 ఏళ్ల ఉస్మాన్‌ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వివరించాడు.

ADVERTISEMENT