'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం
ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీకి ఆదివారం ఈజిప్టు అత్యున్నత పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది నైల్' ప్రకటించారు. కైరోలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ నరేంద్ర మోదీకి పురస్కారాన్ని అందజేశారు. ప్రపంచంలోని వివిధ దేశాలు ప్రధాని మోదీకి ప్రదానం చేసిన 13వ అత్యున్నత స్టేట్ గౌరవం ఇది. ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టుకు వెళ్లడం ఇదే తొలిసారి. తొలుత ప్రధాని మోదీ, ఫతా ఎల్-సీసీ ఆదివారం తెల్లవారుజామున సమావేశమయ్యారు. ఇరువురు నేతలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
హీలియోపోలిస్ మెమోరియల్‌ను సందర్శించిన మోదీ
ఈజిప్టు పర్యటన సందర్భంగా మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్, పాలస్తీనాలో పోరాడి మరణించిన దాదాపు 4,000 మంది భారతీయ సైనికుల స్మారక చిహ్నం హీలియోపోలిస్ (పోర్ట్ తెవ్ఫిక్) మెమోరియల్‌ను ప్రధాని మోదీ సందర్శించి, నివాళులర్పించారు. భారతదేశంలోని దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో ఇటీవల పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. 16వ ఫాతిమిద్ ఖలీఫా అయిన అల్-హకీమ్ బి-అమ్ర్ అల్లా పేరు మీదుగా ఈ మసీదుకు పేరు పెట్టారు. ప్రధాన మంత్రి మసీదు ప్రాంగణం చుట్టూ తిరిగారు, శిల్పకళా అద్భుతాన్ని మెచ్చుకున్నారు. అనంతరం మసీదు ప్రాంగణంలోని చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. అల్-హకీమ్ మసీదు ఈజిప్టులోని కైరోలో 11వ శతాబ్దపు ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశం.