Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి వారే కారణం.. భారత్ కాదు: నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్ చేశారు. తమ దేశ ఆర్థిక సంక్షోభానికి పాకిస్థాన్ సైన్యమే కారణమని పరోక్షంగా విమర్శించారు. పాక్ ఆర్థిక బాధల వెనుక భారత్ కానీ, అమెరికా కానీ లేవన్నారు. 'మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నాం' అన్నారు. లాహోర్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ముఖ్య కార్యకర్తల సమావేశంలో నవాజ్ షరీఫ్ ఆయన ఈ కామెంట్స్ చేశారు. 1990-1993, 1997-1999, 2013-2017 మధ్య కాలంలో నవాజ్ షరీఫ్‌కు ప్రధానిగా పని చేశారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించాలని అనుకుంటున్నారు.
పాక్‌లోని కోర్టులపై మండిపడ్డ నవాజ్
2018 ఎన్నికల్లో వారు (ఆర్మీ) రిగ్గింగ్ చేసి తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. దీనివల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఆర్థిక వ్యవస్థ పతనమైనట్లు పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ దేశంలోని కోర్టులను కూడా టార్గెట్ చేశారు. వారు(సైన్యం) రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు న్యాయమూర్తులు వారికి పూలమాల వేసి వారి పాలనకు చట్టబద్ధత కల్పిస్తారని విమర్శించారు. ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించడాన్ని న్యాయమూర్తులు ఆమోదిస్తారన్నారు. పార్లమెంటు రద్దును కూడా న్యాయమూర్తులు ఎందుకు ఆమోదిస్తారని ప్రశ్నించారు. 2017లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనపై నవాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.