Nepal: నేపాల్ లో MDH,ఎవరెస్ట్ సుగంధ ద్రవ్యాలపై నిషేధం.. కారణమేంటంటే..?
సింగపూర్, హాంకాంగ్ తర్వాత, ఇప్పుడు నేపాల్ కూడా రెండు భారతీయ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, MDH విక్రయం, వినియోగం,దిగుమతిని నిషేధించింది. ఈ మసాలా దినుసుల్లో పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ ఉందన్న భయంతో నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సుగంధ ద్రవ్యాలలో ఇథిలీన్ ఆక్సైడ్ పై దర్యాప్తు జరుగుతోంది. ఎవరెస్ట్,ఎండీహెచ్ బ్రాండ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించాం. ఈ మసాలాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వార్తలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
బ్రిటన్, న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా పరిశోధనలు
ఈ రెండు బ్రాండ్ల మసాలా దినుసుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. విచారణ నివేదిక వచ్చే వరకు నిషేధం కొనసాగుతుంది. MDH, ఎవరెస్ట్ పేర్లు దశాబ్దాలుగా ఇంటి పేర్లుగా మారాయి.ఈ బ్రాండ్‌ల మసాలా దినుసులు మిడిల్ ఈస్ట్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేయబడతాయి. MDH, ఎవరెస్ట్ మసాలా దినుసులపై బ్రిటన్, న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా పరిశోధనలు ప్రారంభమయ్యాయి. బ్రిటన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ (FSA) కఠిన చర్యలు తీసుకుంటూ, భారతదేశం నుండి వచ్చే అన్ని సుగంధ ద్రవ్యాలపై విషపూరిత పురుగుమందుల పరీక్షను కఠినతరం చేస్తున్నామని, ఇందులో ఇథిలీన్ ఆక్సైడ్ కూడా ఉంది.
MDH,ఎవరెస్ట్ మసాలా దినుసులపై విచారణ మొదలుపెట్టిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్ తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జెన్నీ బిషప్ మాట్లాడుతూ ఇథిలీన్ ఆక్సైడ్ ఒక రసాయనమని, ఇది మానవులకు క్యాన్సర్‌ను కలిగిస్తుందని అన్నారు. ఈ MDH, ఎవరెస్ట్ మసాలా దినుసులు న్యూజిలాండ్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉన్నాయని ఈ అంశంపై విచారణ మొదలు పెడతామన్నారు.
సింగపూర్, హాంకాంగ్‌ల లో కొనసాగుతున్న నిషేధం
హాంకాంగ్ తర్వాత, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) కూడా ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను నిషేధించింది. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గుర్తించింది. మానవుల ప్రాణాలకు హాని కలుగుజేసే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా ఎస్‌ఎఫ్ఏ తేల్చింది. దీంతో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను తిరిగి ఇండియాకు పంపించాలని ఆదేశించింది.
ఈ ఇథిలీన్ ఆక్సైడ్ అంటే ఏమిటి?
ఇథిలీన్ ఆక్సైడ్ రంగులేని వాయువు. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఇది తీపి వాసనను ఇస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం, ఈ వాయువు ఇథిలీన్ గ్లైకాల్ (యాంటీ-ఫ్రీజ్) వంటి రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కాకుండా, ఇది వస్త్రాలు, డిటర్జెంట్లు, నురుగులు, మందులు, అంటుకునే పదార్థాలు, ద్రావణాల తయారీలో కూడా ఉపయోగించబడుతుంది. E. coli, సాల్మొనెల్లా వంటి సూక్ష్మజీవుల కాలుష్యాన్ని నివారించడానికి ఆహార సుగంధ ద్రవ్యాలలో కూడా ఇది తక్కువ పరిమాణంలో ఉపయోగించబడుతుంది. ఆసుపత్రులలో శస్త్రచికిత్సా పరికరాలను శుభ్రం చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
ఇది ఎంత ప్రమాదకరమైనది?
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC)ఇథిలీన్ ఆక్సైడ్‌ను'గ్రూప్-1 కార్సినోజెన్' విభాగంలో ఉంచింది. అంటే ఇది మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమవుతుందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఈ రసాయనాన్ని తరుచుగా తినే వ్యక్తులు కళ్ళు,చర్మం,ముక్కు,గొంతు,ఊపిరితిత్తులకు సమస్యలు రావచ్చు. ఇది మెదడు, నాడీ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుంది. US ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) ప్రకారం,ఇథిలీన్ ఆక్సైడ్‌కు గురికావడం వల్ల మహిళల్లో లింఫోయిడ్ క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, అప్పుడప్పుడు లేదా చాలా తక్కువ పరిమాణంలో దాని వినియోగించడం వల్ల ప్రమాదమేమీ లేదు. అందుకే దీన్ని సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాలు కాకుండా, అనేక ఇతర ఆహార పదార్థాలలో దీనిని ఉపయోగిస్తారు.