
Nepal Minister: నేపాల్ సంక్షోభం.. రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం కారణంగా, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రాజధాని ఖాట్మాండు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు జ్వాలలాగా ప్రజ్వలించాయి. యవకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఈ నిరసనలు సోమవారం హింసాత్మక దశకు చేరిన సందర్భంలో, 19 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు ఇళ్లతో పాటు సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు.
వివరాలు
త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రభుత్వ మంత్రులు, అధికారులు
ఇవి జరుగుతున్న సమయంలో, నేపాల్‌లో ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా, దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజీనామా చేశారు. అంతకుముందే, ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రభుత్వ మంత్రులు, అధికారులు తరలిపోతున్నారు. నిరసనలు రెండురోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకూ 22 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఇంకా, అనేక మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ పదవుల నుంచి తప్పుకోవడంతో రాజకీయ పరిస్థితి మరింత అస్థిరతకు దారితీస్తోంది.