Page Loader
Israel-Iran: 'ఇరాన్‌పై 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' ప్రారంభించాం': ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడి
'ఇరాన్‌పై 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' ప్రారంభించాం': బెంజమిన్ నెతన్యాహు

Israel-Iran: 'ఇరాన్‌పై 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' ప్రారంభించాం': ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ చేపట్టిన తీవ్ర మిలిటరీ దాడులతో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలకు లోనవుతోంది. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని 'ఆపరేషన్ రైజింగ్ లయన్' అనే సైనిక చర్యను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ దాడిలో ఇరాన్ అణు ప్రణాళికకు కీలకమైన ప్రాంతాన్ని తమ దళాలు ధ్వంసం చేశాయని తెలిపారు. శుక్రవారం ఆయన ఈ విషయాన్ని ఒక వీడియో సందేశం ద్వారా ప్రజలకు వెల్లడించారు.

వివరాలు 

శుద్ధి చేసిన యురేనియంతో సుమారు తొమ్మిది అణుబాంబులు

''ఇజ్రాయెల్, కొద్ది సేపటి క్రితం 'ఆపరేషన్ రైజింగ్ లయన్'ను ప్రారంభించింది. ఇది మన దేశానికి ముప్పుగా మారుతున్న ఇరాన్‌కు తగిన సమాధానం చెప్పేందుకు చేపట్టిన చర్య. ఈ మిషన్ తాత్కాలికమేగాదు, ముప్పును పూర్తిగా నిర్వీర్యం చేసేంతవరకూ ఇది కొనసాగుతుంది. ఇరాన్ గత కొన్ని దశాబ్దాలుగా బహిరంగంగానే ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని ప్రకటిస్తోంది. ఆ దేశం అణ్వాయుధాల అభివృద్ధిపై తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా, వారు అధిక పరిమాణంలో శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేశారు. దీని ద్వారా సుమారు తొమ్మిది అణుబాంబులు తయారు చేయగలగడం సాధ్యమవుతుంది," అని నెతన్యాహు వివరించారు.

వివరాలు 

ఇరాన్ అణుశక్తి అభివృద్ధి  ప్రాంతాలపైనే దాడులు

ఇరాన్ గత కొంతకాలంగా మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడే ఆ దేశాన్ని అడ్డుకోకపోతే, తక్కువ సమయంలోనే వారు అణ్వాయుధాలు సిద్ధం చేసుకోగలరు. ఇది ఇజ్రాయెల్‌కు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. "నాజీ హోలోకాస్ట్ నుంచే మేము బోలెడంత నేర్చుకున్నాం. మరోసారి మేము బాధితులుగా మిగలాలని మేము అనుకోవట్లేదు. అందుకే మేము ముందుగా చర్యలు తీసుకున్నాం. ఇరాన్ అణుశక్తి అభివృద్ధికి ముఖ్యమైన ప్రాంతాలపైనే మేము దాడులు జరిపాం. నంతాజ్‌లోని అణు శుద్ధి కేంద్రాన్ని మేము లక్ష్యంగా చేసుకున్నాం. అణ్వాయుధ పరిశోధనలో నిమగ్నమైన ముఖ్య శాస్త్రవేత్తలే మా లక్ష్యంగా మారారు. టెహ్రాన్‌లోని బాలిస్టిక్ క్షిపణుల ప్రాజెక్టుకు కీలకమైన ప్రాంతాన్ని కూడా మేము ధ్వంసం చేశాం," అని ఆయన వివరించారు.

వివరాలు 

పోరాటం ఇరాన్‌ ప్రజలపై కాదు 

అంతేకాకుండా, గతంలో ఇరాన్,దాని మిత్రదేశాలు కలసి ఇజ్రాయెల్‌పై దాడికి యత్నించాయని నెతన్యాహు ఆరోపించారు. ప్రస్తుతం తమ దేశంపై మరోసారి కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి కుట్రలను తాము సహించబోమని స్పష్టం చేశారు. ఈ కారణంగానే తమ ఆర్మీ ఈ దాడులకు పాల్పడిందని చెప్పారు. అయితే, ఈ పోరాటం ఇరాన్‌ ప్రజలపై కాదని, ఆ దేశ నియంతృత్వ పాలనపై మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఇరాన్‌పై 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌'