LOADING...
Netanyahu: ఇరాన్‌తో యుద్ధ విరమణ.. నెతన్యాహు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం
ఇరాన్‌తో యుద్ధ విరమణ.. నెతన్యాహు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

Netanyahu: ఇరాన్‌తో యుద్ధ విరమణ.. నెతన్యాహు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్రమైన రాజకీయ ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇరాన్‌ను పూర్తిగా బలహీనపరుస్తానని ముందుగా ప్రకటించిన ఆయన, మధ్యలోనే యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని 'చారిత్రక పొరపాటు'గా అభివర్ణిస్తూ ప్రతిపక్ష నేతలు,రక్షణ రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ చరిత్రలోనే పెద్ద రాజకీయ వైఫల్యంగా నిలిచిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సైన్యం సమర్థంగా పోరాడుతున్న సమయంలోనే నెతన్యాహు తీసుకున్న తడబాటు నిర్ణయం దేశాన్ని ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చిందని వారు విమర్శిస్తున్నారు. ఇరాన్‌పై పూర్తి విజయాన్ని సాధించకుండానే వెనక్కి తగ్గడం,ఆ దేశ దూకుడుకు తలవంచడమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

ట్రంప్ ఒత్తిడి కారణంగానే..

ఈ విరామాన్నిఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను మళ్లీ బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకునే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి కారణంగానే నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. దీనివల్ల ఇజ్రాయెల్ స్వతంత్ర రక్షణ విధానం బలహీనపడిందని వారు అంటున్నారు. ఒప్పందం నుంచి హెజ్బుల్లాను తప్పించినా, ఇరాన్‌కు లభించిన ఊరటతో ప్రాంతీయ ముప్పు తగ్గదని స్పష్టం చేస్తున్నారు.

వివరాలు 

నెతన్యాహు ప్రభుత్వం నిలదొక్కుకుంటుందా లేదా కూలిపోతుందా

గత కొన్ని వారాలుగా బాంబు షెల్టర్లలోనే తలదాచుకుంటున్న ప్రజల్లో ఈ ఒప్పందంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. టెల్ అవీవ్ సహా అనేక నగరాల్లో నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. అంతేకాక, కేబినెట్‌లోని కొంతమంది మంత్రులు కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో నెతన్యాహు ప్రభుత్వం నిలదొక్కుకుంటుందా లేదా కూలిపోతుందా అన్న అనిశ్చితి నెలకొంది. రెండు వారాల విరామం తర్వాత యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement