Loading...
Benjamin Netanyahu: ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక.. ఇక తగ్గేదే లేదంటూ సంకేతాలు!
ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక.. ఇక తగ్గేదే లేదంటూ సంకేతాలు!

Benjamin Netanyahu: ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక.. ఇక తగ్గేదే లేదంటూ సంకేతాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ నుంచి ఎదురవుతున్న అణు ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఇజ్రాయెల్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు. దేశ భద్రతను కాపాడాలంటే విస్తృత స్థాయిలో జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్‌ను తమ ప్రభుత్వంలో చేరాలని శనివారం మరోసారి ఆహ్వానించారు.

వివరాలు

ప్రతిపక్షానికి నెతన్యాహు ఆహ్వానం

గురువారం ఐసెన్‌కోట్‌తో జరిగిన సమావేశం తర్వాత జాతీయ ఐక్య ప్రభుత్వ ఏర్పాటుపై తనకు మరింత నమ్మకం కలిగిందని నెతన్యాహు తెలిపారు.

ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చర్చలకు రావాలని, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఇజ్రాయెల్‌ను యూదుల దేశంగా గుర్తించే పార్టీలన్నీ ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందని నెతన్యాహు ఆరోపించారు.

యురేనియం శుద్ధి ప్రక్రియను తిరిగి ప్రారంభించి, అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.

వివరాలు

ఇరాన్ ముప్పును పూర్తిగా తొలగించడమే లక్ష్యం

గతంలో ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ రోరింగ్ లయన్ ద్వారా తక్షణ ప్రమాదాన్ని దూరం చేశామని నెతన్యాహు పేర్కొన్నారు.

భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

మరోవైపు ఐసెన్‌కోట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నెతన్యాహు విమర్శించారు. అది బలహీనమైన, ప్రమాదకరమైన ప్రభుత్వంగా మారుతుందని వ్యాఖ్యానించారు.

అరబ్ పార్టీలపై ఆధారపడే పరిమిత కూటమి ఇరాన్ ముప్పును సమర్థంగా ఎదుర్కోలేదని ఆరోపించారు. అరబ్ పార్టీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు

సైనిక నియామకాల అంశంపైనా చర్చలు

జాతీయ ఐక్యతా ప్రభుత్వంలో సైనిక నియామకాల అంశానికి కూడా పరిష్కారం కనుగొనాలని నెతన్యాహు అన్నారు.

అల్ట్రా ఆర్థడాక్స్ వర్గాల ప్రతినిధులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.

దేశంలో నెలకొన్న రాజకీయ విభేదాలకు ముగింపు పలికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT