చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం
చైనాలో జూన్ చివరి నాటికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ XBB విజృంభిస్తుందని, తద్వారా కేసులు భారీగా పెరుగుతాయని ఓ సీనియర్ ఆరోగ్య సలహాదారుడు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కోవిడ్ వేరియంట్ XBB ఉద్ధృతి వల్ల కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయంటే, వారానికి 6.5కోట్ల మందికి వైరస్ బారిన పడుతారని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్‌లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తోంది. చైనాలో ఏప్రిల్ చివరి నుంచి XBB వేరియంట్ కేసుల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. మే చివరి నాటికి వారానికి 40 మిలియన్ల మందికి కరోనా సోకే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెప్పింది. ఒక నెల తర్వాత కేసులు 6.5 కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది.
కొత్త వ్యాక్సిన్‌లను విడుదల చేసేందుకు చైనా సన్నాహాలు
కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొత్త వ్యాక్సిన్‌లను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చివరిసారిగా వచ్చిన కరోనా వేవ్‌లో 37 మిలియన్ల మంది ప్రజలు ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా ప్రభావితం అయ్యారు. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, మందులు లభించక, ఆఖరికి శ్మశానవాటికలు కూడా రద్దీగా ఉన్న దృశ్యాలు గత వేవ్ సమీపంలో కనిపించాయి. అందుకే చైనా అధికారులు ఈసారి XBBని లక్ష్యంగా చేసుకునే కొత్త వ్యాక్సిన్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.