
New work rules in Oman: ఒమన్‌లో సరికొత్త వర్క్ రూల్స్.. ఇంజనీరింగ్,ఫైనాన్స్ నిపుణులకు ఇప్పుడు సర్టిఫికేషన్ తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
గల్ఫ్ దేశమైన ఒమన్‌లో పని నిబంధనలలో భారీ మార్పులు అమలులోకి రాబోతున్నాయి. 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రంగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ తప్పనిసరిగా సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ రంగంలో పనిచేసే వారు తప్పనిసరిగా ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ నుండి క్లాసిఫికేషన్ సర్టిఫికెట్ పొందాలి. ఈ సర్టిఫికెట్ తీసుకోవడం కోసం సెక్టార్ స్కిల్ యూనిట్ ఆమోదం అవసరం. వర్క్ పర్మిట్‌ను పునరుద్ధరించుకునే ముందు ఈ ధ్రువీకరణ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వివరాలు
20 రకాల ఉద్యోగాల్లో పనిచేసేవారికి ధ్రువీకరణ తప్పనిసరి
అదే విధంగా, 2025 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అకౌంటింగ్, ఫైనాన్షియల్ విభాగాలకు చెందిన 20 రకాల ఉద్యోగాల్లో పనిచేసే వారు కూడా తప్పనిసరిగా ధ్రువీకరణ పొందాల్సిన నిబంధనను ఒమన్ ప్రభుత్వం విధించింది. ఈ ఉద్యోగాలలో అకౌంట్స్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్, అసిస్టెంట్ ఇంటర్నల్ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్‌టర్నల్ ఆడిటర్, కాస్ట్ అకౌంటెంట్, క్రెడిట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, అకౌంట్స్ మేనేజర్, ట్యాక్స్ మేనేజర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎక్స్‌టర్నల్ ఆడిట్ మేనేజర్, ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, సీనియర్ ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, ఎక్స్‌టర్నల్ ఆడిట్ పార్ట్‌నర్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ వంటి పదవులు ఉన్నాయి.
వివరాలు
ఈ -పోర్టల్ ద్వారా దరఖాస్తు
ఇకపై యజమానులు, విదేశీ ఉద్యోగులు వర్క్ పర్మిట్ కోసం ఈ-పోర్టల్ ద్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారికి వర్క్ పర్మిట్ మంజూరు లేదా పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో పనిచేస్తున్న కార్మికుల నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒమన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఇటువంటి నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో, ఒమన్ కూడా అదే దారిలో కొనసాగుతోంది.
వివరాలు
ఈ మార్గదర్శకాల వల్ల దేశంలో నిరాటంకంగా వ్యాపార కార్యకలాపాలు
ఇంజినీర్లు,అకౌంటెంట్ వృత్తి నిపుణులకు లేబర్ మార్కెట్‌లో నైపుణ్యాలు పెరగేందుకు ఈ ధ్రువీకరణ విధానం ఉపయోగపడనుంది. సర్టిఫికేషన్ కోసం నిర్దిష్ట గడువు సమయాన్ని, డిజిటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మార్గదర్శకాల వల్ల యజమానులు దేశంలో నిరాటంకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. అదే విధంగా వృత్తి నిపుణులు తమ ఉద్యోగాలను ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు వీలు కలుగుతుంది.