New York: న్యూయార్క్ నగరాన్ని కమ్ముతున్న కార్చిచ్చు పొగ.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
న్యూయార్క్ నగరం కార్చిచ్చు పొగతో మూసుకుపోయింది. అల్‌స్టర్, సుల్వాన్ కౌంటీల్లో మొదలైన అగ్ని ప్రమాదాలు 80 మైళ్ళ దూరంలో ఉన్న నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎగిరే మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. పొడి వాతావరణం, గత నెల రోజులుగా వర్షం లేకపోవడం కారణంగా అగ్నిప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. శనివారం సాయంత్రం, వెస్ట్ మిల్‌ఫోర్డ్ వద్ద జెన్నింగ్ క్రీక్ ఫైర్ మొదలైంది, దాదాపు 2,000 ఎకరాలను కాల్చివేసింది. అల్‌స్టర్, సుల్వాన్ కౌంటీల్లో కూడా భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శనివారం గాలులా వీచిన ఈ అగ్ని పొగ న్యూయార్క్ నగరాన్ని కప్పేసింది.
శ్వాస సంబంధ సమస్యలు రావొచ్చు
ఈ పరిస్థితులు ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ హెచ్చరించారు. శ్వాస సంబంధ సమస్యలు రావొచ్చు, అందువల్ల ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. నగరంలో ఎయిర్ క్వాలిటీ హెల్త్ అడ్వైజరీ కూడా జారీ చేయబడి ఉంది. న్యూజెర్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ప్రకారం, ఈ పొగ అలానే ఉంటుందని, ఒక మోస్తరు వర్షం పడే వరకు దీని ప్రభావం కొనసాగుతుందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో అక్టోబర్‌లో వర్షం పడకపోవడం ఇదే తొలిసారి. పెన్సిల్వేనియా, న్యూజెర్సీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం న్యూయార్క్‌లో అంగుళం మేర వర్షం పడే అవకాశం ఉంది, ఇది పొగ నుంచి కొంత ఉపశమనం ఇవ్వవచ్చు